అతి త్వరలో మల్కపేట జలాశయాన్ని ప్రారంభించనున్న సీఎం : మంత్రి కేటీఆర్

by Sumithra |
అతి త్వరలో మల్కపేట జలాశయాన్ని ప్రారంభించనున్న సీఎం : మంత్రి కేటీఆర్
X

దిశ, కోనరావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయలకు, పాఠశాలల పునర్నిర్మానానికి ప్రధాన ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై. వి. సుబ్బారెడ్డితో కలిసి శంకుస్థాపన, భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కే టి రామారావు మాట్లాడుతూ టీటీడీ ఆర్థిక సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశక్తి, ప్రభ కలిగిన ప్రసిద్ధ దేవాలయాలను కొంత డబ్బుతో భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తూ పూర్వ వైభవం తేవచ్చు అని ఒక రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డిలు సానుకూలంగా స్పందించారన్నారు.

ఫలితంగా ఇప్పుడు సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎల్లారెడ్డిపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసిఆర్ నేతృత్వంలోనీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. గంభీరావు పేటలో కేజీ టు పీజీ క్యాంపస్ ను అభివృద్ధి చేసిన మాదిరే ఎల్లారెడ్డి పేట ప్రభుత్వ స్కూల్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మనబడి కార్యక్రమం కింద అభివృధి చేస్తున్నామని తెలిపారు. మండు వేసవిలో తెలంగాణలోని చెరువులు, కుంటలు, నదులు, ఏరులు, కాల్వలు జలకళను సంతరించుకున్నాయన్నారు. సీఎం కేసిఆర్ సంకల్పంతో తెలంగాణ సస్య శ్యామలం అయ్యిందన్నారు.

హెలికాప్టర్ లో వస్తున్నప్పుడు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, గౌరవెళ్లి ప్రోజెక్ట్, మధ్య మానేరు జలాశయాలతో తెలంగాణ నిండు కుండను తలపిస్తుందన్నారు. ఒకప్పుడు కొనసీమలో సినిమాలు తీసేవారని, 9ఎండ్లలో జరిగిన అభివృద్ధి వల్ల ఇప్పుడు తెలంగాణలో సినిమా తీసేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.తెలుగు ప్రాంతాలు భూభాగాలుగా విడిపోయిన అన్నదమ్ములుగా కలిసి ఉండాలన్నది, అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ విధానమని అన్నారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలతో పాటు బ్రాహ్మణ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అణగారినవర్గాలనే కాదు అగ్రవర్ణ పేదలను కూడ ప్రభుత్వం కడుపులో పెట్టుకుంటుందన్నారు. దమ్మున్న ముఖ్యమంత్రి కాబట్టే సీఎం కేసీఆర్ దళిత బంధు వంటి పథకం అమలు చేస్తున్నారన్నారు.

పక్షం, 20 రోజుల్లో మల్కపేట జలాశయాన్ని సీఎం కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మల్కపేట జలాశయంతో ఎల్లారెడ్డి పేట శాశ్వతంగా సస్య శ్యామలం కానుందని మంత్రి తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. దేశ జనాభాలో 3 శాతం జనాభా కలిగిన తెలంగాణ కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు అందించే జాతీయ అవార్డులలో 30 శాతం అవార్డులను సాధించాయని గుర్తుచేశారు.పట్టణాలు కూడా అదే బాటలో నడుస్తూ 25 అవార్డులు అందుకున్నాయన్నారు. సిరిసిల్ల,ఎల్లారెడ్డి పేటలో ఆలయాల పున నిర్మానాణికి సహకరించిన టిటిడి గంభీ రావుపేట సీతారామ ఆలయం పున నిర్మాణంకు కూడా ఆర్థిక సహాయం అందజేయవలసిందిగా కోరగా టిటిడి ఛైర్మన్ సానుకూలంగా స్పందించారన్నారు.

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాల పునరుద్ధరణ పనులు - టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి

దేశ వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కొత్త ఆలయాలను నిర్మించడం,పునరుద్ధరణ మొదలైన కార్యక్రమాలను టిటిడి గడిచిన 4 ఎండ్లుగా చేస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాలు,గిరిజనులు ఉండే చోట పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మిస్తున్నామన్నారు. కరీంనగర్ లో 20 కోట్లతో శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సిఎం కేసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. గడిచిన 9 ఎండ్లలో తెలంగాణ రూపు రేఖలు మారాయని కొనియాడారు.

Next Story