జన గణనలో కుల గణన చేపట్టాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి.

by Ratna Kumari |

జన గణనలో కుల గణన చేపట్టి బీసీలకు సముచిత రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

జన గణనలో కుల గణన చేపట్టాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
X

దిశ, జగిత్యాల టౌన్: జన గణనలో కుల గణన చేపట్టి బీసీలకు సముచిత రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలకు తగిన న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే జాతీయ జనగణనలో కుల గణనను కూడా చేర్చాలని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేశారు. కులాల వారీగా నిర్దిష్ట జనాభా లెక్కలు నమోదు చేయడం ద్వారా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఓబీసీ-27%, ఈడబ్ల్యూఎస్-10% రిజర్వేషన్లు అమలులో ఉన్నప్పటికీ, బీసీల వాస్తవ జనాభా శాతాన్ని పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానం చేసినప్పటికీ, 50 శాతం పరిమితి కారణంగా అమలు కాలేదని తెలిపారు. జనగణనతో పాటు కుల గణన చేపడితే బీసీల స్థితిగతులు స్పష్టమవుతాయని, విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. ఈ అంశంపై సీఎం కు లేఖ రాసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ స్వామి, రాజేందర్, దుర్గయ్య, పుప్పాల అశోక్ పాల్గొన్నారు.

Next Story