రెండో రోజుకు చేరిన డంపింగ్ యార్డు వ్యతిరేక దీక్షలు

by Ratna Kumari |

హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగాపూర్, రాంపూర్ గ్రామాల పరిధిలో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా స్థానిక ప్రజల పోరాటం ఉధృతమవుతోంది.

రెండో రోజుకు చేరిన డంపింగ్ యార్డు వ్యతిరేక దీక్షలు
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగాపూర్, రాంపూర్ గ్రామాల పరిధిలో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా స్థానిక ప్రజల పోరాటం ఉధృతమవుతోంది. రెండో రోజుకు చేరుకున్న ఈ నిరసన దీక్షలు మంగళవారం హుజూరాబాద్‌లోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఉద్రిక్తంగా కొనసాగాయి. ఈ దీక్షల్లో సింగాపూర్, తుమ్మనపల్లి గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి జయన్న ఫౌండేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ...'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్ పేరుతో ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దనిహెచ్చరించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. ప్లాంట్ నుంచి వచ్చే కాలుష్యం వల్ల 15 కిలోమీటర్ల మేర ప్రజలు శ్వాసకోశ, అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.


భూసారం పూర్తిగా దెబ్బతిని, ఈ ప్రాంతంలో పంటలు పండని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. భూగర్భ జలాలు కలుషితమై భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు మౌనంగా ఉండటం శోచనీయమని జైపాల్ రెడ్డి విమర్శించారు. పార్టీల ప్రాతిపదికన కాకుండా, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఏకమై ఈ ప్రాజెక్ట్ రద్దయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సింగాపూర్, తుమ్మనపల్లి గ్రామాల సర్పంచ్ లు కల్వల సంపత్, అన్నాడి మాధవి రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ లు పాకాల నారాయణరెడ్డి, కేసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ గూడూరు ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు యాళ్ల రాజేశ్వర్ రెడ్డి, వార్డు సభ్యులు కేశవేణి మోహన్, గుడిపాటి చందు, గ్రామస్తులు రజనీకర్ రెడ్డి, హరీష్, కేశవేని బుచ్చిమల్లు, ఇంద్రసేనారెడ్డి, కమల్ , ఊరడి ధర్మారెడ్డి, బొక్కల రత్నాకర్ రెడ్డి, బొక్కల వీరారెడ్డి, ఉరటి రాజు, గోపిడి రాజిరెడ్డి నాయ‌కులు, రైతులు పాల్గొన్నారు.

Next Story