​మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్.. ప్ర‌మాణ స్వీకారానికి ముందే హామీ అమ‌లు

by Ratna Kumari |

"మాట ఇవ్వడమే కాదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలోనే అసలైన రాజకీయ నాయకత్వం ఉంది" అని నిరూపించారు హుజురాబాద్ మున్సిపల్ 21వ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్ గౌడ్.

​మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్.. ప్ర‌మాణ స్వీకారానికి ముందే హామీ అమ‌లు
X

దిశ‌, హుజూరాబాద్ రూర‌ల్ : "మాట ఇవ్వడమే కాదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలోనే అసలైన రాజకీయ నాయకత్వం ఉంది" అని నిరూపించారు హుజురాబాద్ మున్సిపల్ 21వ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్ గౌడ్. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేయకముందే తన ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ​ఎన్నికల ప్రచార సమయంలో 21వ వార్డు ప్రజలకు పంజాల మనోజ్ 9 ప్రధాన వాగ్దానాలు చేశారు. అందులో భాగంగా వార్డులోని పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు తన వంతు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ, గురువారం వార్డుకు చెందిన ఒక ఆడబిడ్డ వివాహానికి రూ. 10,116/- నగదును పెళ్లి కానుకగా అందజేశారు.

ప్ర‌జ‌ల సేవే ల‌క్ష్యం

తన పై నమ్మకంతో గెలిపించిన వార్డు ప్రజల రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. వార్డులోని సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలతో పాటు వార్డు సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను తూచా తప్పకుండా అమలు చేస్తానని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. పదవీ బాధ్యతలు చేపట్టకముందే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై 21వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. పేద కుటుంబానికి అండగా నిలవడాన్ని ఆదర్శంగా కొనియాడుతున్నారు.

Next Story