Kalvakuntla Kavitha: బుల్డోజర్లు తెచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తాం

by Gantepaka Srikanth |

మూసీ నదిలో భారీ అంతస్తుల భవనాలను కడుతుంటే హైడ్రాకు కనిపించడం లేదా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

Kalvakuntla Kavitha: బుల్డోజర్లు తెచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ నదిలో భారీ అంతస్తుల భవనాలను కడుతుంటే హైడ్రాకు కనిపించడం లేదా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికులతో కలిసి బుధవారం కవిత ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుత్భుల్లాపూర్‌లో, ఖమ్మంలోని వెలుగుమట్లలో పేదల ఇళ్లను అక్రమంగా కూల్చేశారని.. మూసీలోనూ పేదల ఎంతో మంది ఇళ్లను కూల్చేశారని అన్నారు. కానీ అదే మూసీలో కడుతున్న ఈ బిల్డింగ్ మాత్రం హైడ్రా రంగనాథ్‌కు, ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు. రంగనాథ్‌కు ఫోన్ చేస్తే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఉన్నానని చెప్పారని.. ఆయన బుల్డోజర్లు తెచ్చే వరకూ తామంతా ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. జనం బాటలో భాగంగా చెరువులు, నదులు ఆక్రమించి కట్టిన బిల్డింగ్‌ల గురించి ఫిర్యాదులు ఇచ్చామని.. ఇప్పటివరకూ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని అన్నారు.

అదే ఖమ్మంలోని వెలుగుమట్లలో 600 మంది పేదల ఇళ్లు కూల్చేశారు.. త్వరలోనే అక్కడకు వెళ్తామని స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సిటీలోని మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాళ్లను సైతం ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఎంతో మంది మధ్య తరగతి వాళ్లు కష్టపడి అక్కడ అపార్ట్‌మెంట్లు కొనుక్కున్నారని.. దాదాపు 20 ఏళ్ల క్రితం కట్టిన ఆ అపార్ట్‌మెంట్ వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తమకు ప్రైవేట్ వాళ్లతో ఎలాంటి పంచాయితీ లేదని.. ప్రభుత్వంతోనే అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బిల్డింగ్‌ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలలపాటు ఈ నిర్మాణాలను ఆపారని.. ఆ తర్వాత ఆమ్యామ్యాలు తీసుకొని మళ్లీ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నదే తమ పోరాటమని.. కచ్చితంగా మూసీని, తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటామని వెల్లడించారు.

Next Story