నీకు ఎంత ధైర్యం..?.. తేజస్వి సూర్యపై కవిత నిప్పులు

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నీకు ఎంత ధైర్యం..?.. తేజస్వి సూర్యపై కవిత నిప్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "నీకు ఎంత ధైర్యం..?" అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, అమరుల త్యాగాలను కించపరిచేలా మాట్లాడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండు పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటును అవమానించడం అంటే, తెలంగాణ కోసం పోరాడిన కోట్లాది మంది ప్రజలను అవమానించడమేనని కవిత పేర్కొన్నారు. "ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయమైనవి కావు.. తెలంగాణను సాకారం చేయడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వేలాది మంది అమరులను అగౌరవపర్చడమే. మా భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం సరికాదు" అని ఆమె స్పష్టం చేశారు.

రాజీనామా చేయాల్సిందే..

తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన తేజస్వి సూర్య, తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, నాయకులపై కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. "తెలంగాణ ప్రయోజనాలను కాపాడకపోతే, రాష్ట్రాన్ని అవమానించిన వారికి బుద్ధి చెప్పకపోతే.. మీకు పదవుల్లో ఉండే అర్హత లేదు" అని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్ వంటి నేతలు తమ సొంత రాష్ట్రం పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, లేదంటే ప్రజలకు సమాధానం చెప్పలేరని కవిత హెచ్చరించారు.

Next Story