ఆ విషయం నేను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నా.. కల్వకుంట్ల కవిత ఫైర్

by Ramesh Naini |

డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎర్రవెల్లి- గోకారం నిర్వాసితుల ఆందోళనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు.

ఆ విషయం నేను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నా.. కల్వకుంట్ల కవిత ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎర్రవెల్లి- గోకారం నిర్వాసితుల ఆందోళనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆమె కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, గోదావరి ప్రాజెక్ట్ మీద మనం చాలా ప్రాజెక్ట్ లను కట్టుకుంటూ పోయామని తెలిపారు. అదే విధంగా కృష్ణా నది ద్వారా 25 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉందని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్‌లు పూర్తి చేసిన సరే చాలా ఎకరాలకు నీళ్లు వచ్చేవి అని తెలిపారు. కానీ కనీసం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. సంపూర్ణంగా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉందని, మనకు ఇబ్బందులు తగ్గాలంటే ఇంకా నీళ్లు ఎక్కువగా వాడుకోవాలన్నారు.

కానీ డిండి ప్రాజెక్టు కింద ప్రపోజ్ చేసిన గోకారం చెరువు అంశాన్ని మాట్లాడుకోవాలని తెలిపారు. గోకరాంలో 9 వందల ఎకరాలు, ఎర్రవెల్లి లో 6 వందల ఎకరాలు ప్రపోజ్ చేశారని అన్నారు. కానీ 15 వందల ఎకరాల భూమి తీసుకుంటే 2 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తాయని స్పష్టం చేశారు. గోకారం చెరువునే మరింత పటిష్టం చేస్తే ఆ నీళ్లను చెరువు ద్వారానే తీసుకోవచ్చన్నారు. ఇలాంటి అవకాశం ఉన్న సరే బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ కాంగ్రెస్ గానీ స్పందించలేదని ఫైర్ అయ్యారు. ఇక్కడి ప్రజలు తమ నిరసనగా సర్పంచ్ ఎన్నికలను బాయ్ కాట్ చేశారని తెలిపారు. అయినా సరే ఇక్కడి ఎమ్మెల్యే గానీ ప్రతిపక్షాలు గానీ స్పందించ లేదన్నారు. కనీసం ఎన్నికల కమిషనర్ కూడా స్పందించకపోవటం దారుణమని పేర్కొన్నారు.

ఓటు హక్కు ఉన్న ప్రజలను పట్టించుకోలేదంటే ఎర్రవెల్లి వాసులు మనుషులు కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయాన్ని నేను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నా.. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తా అని హామీ ఇచ్చారు. ఇంతకన్నా అద్భుతంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన తెలుపగలరా? అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ వచ్చి ఇక్కడ పరిస్థితిని పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఒకటి రెండు రోజుల్లో స్పందించకపోతే ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రిని కూడా నిలదీద్దాం.. అని అన్నారు. ఎర్రవెల్లి గ్రామం, ఎర్రవెల్లి తాండ ప్రజలు చేస్తున్న పోరాటానికి మీ సోదరిగా నా మద్దతు ఉంటుంది.. అని కవిత భరోసా ఇచ్చారు.

Next Story