కాళేశ్వరం సరస్వతీ అంత్య పుష్కరాలు: అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-20 14:38:34  IST  )

కాళేశ్వర క్షేత్రంలో రేపటి నుంచి జూన్ 1 వరకు జరగనున్న 'సరస్వతీ అంత్య పుష్కరాలను' వైభవోపేతంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరం సరస్వతీ అంత్య పుష్కరాలు: అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వర (Kaleshwaram) క్షేత్రంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి జూన్ 1 వరకు అంటే 12 రోజుల పాటు ఈ పుష్కర వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు సీఎం దేవాదాయ, పోలీసులు ఉన్నతాధికారులతో సరస్వతీ అంత్య పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరానికి దేశ, రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, అందువల్ల ఘాట్ల వద్ద పారిశుధ్యం, తాగునీరు, రక్షణ చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సీఎం సూచించారు.

ట్రాఫిక్, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టండి..

పుష్కరాల సమయంలో కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరుగుతాయని, ముఖ్యంగా ట్రాఫిక్ (Traffic) నియంత్రణపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, పుష్కరాలకు వచ్చే భక్తులు అస్వస్థతకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఘాట్ల వద్ద, క్యూ లైన్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, నిరంతరం మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, అత్యవసర పరిస్థితుల కోసం మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Next Story