కాళేశ్వరం రిపోర్టుపై వ్యూహం మార్చిన సీఎం.. నేడే సభ ముందుకు నివేదిక

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-31 02:04:10  IST  )

అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రవేశ పెట్టే విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్ట్రాటజీ ఫైటింగ్ నడిచింది.

కాళేశ్వరం రిపోర్టుపై వ్యూహం మార్చిన సీఎం.. నేడే సభ ముందుకు నివేదిక
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రవేశ పెట్టే విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్ట్రాటజీ ఫైటింగ్ నడిచింది. సభలో రిపోర్టు ప్రవేశ పెట్టి బీఆర్ఎస్‌పై ఎటాక్ చేసేందుకు అధికార పార్టీ ప్లాన్ చేయగా, రిపోర్టును సభలో ప్రవేశ పెట్టకుండా ఆదేశాలివ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు సోమవారం విచారిస్తామని తెలిపింది. ఇది గ్రహించిన సీఎం రేవంత్‌రెడ్డి తన స్ట్రాటజీ చేంజ్ చేశారు. షెడ్యూల్‌కు భిన్నంగా నేడు ఉదయం 9 గంటలకు సభలో కాళేశ్వరం రిపోర్టు ప్రవేశపెట్టి, అన్ని పార్టీల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు.

కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ‘గులాబీ’ ప్లాన్

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ ఘోష్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీఆర్ఎస్‌పై ఎటాక్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కమిషన్ రిపోర్టుకు చట్టబద్ధత లేదని, రిపోర్టును రద్దు చేయాలని కోరుతూ గతంలో బీఆర్ఎస్ హైకోర్టుకెళ్లింది. కోర్టు స్టే ఇవ్వకుండా విచారణను అక్టోబర్‌కు వాయిదా వేసింది. ఈలోపే సభలో కమిషన్ నివేదికపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. రిపోర్టును సభలో ప్రవేశ పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఒక వేళ చర్చించినా తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో రిక్వెస్టు చేశారు. దీనిపై సోమవారం విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

బీఆర్ఎస్‌కు చాన్స్ ఇవ్వకుండా ప్రభుత్వం స్ట్రాటజీ

బీఆర్ఎస్ లంచ్ మోషన్‌ను విచారించేందుకు కోర్టు సోమవారం సమయం ఇచ్చిన విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి తన స్ట్రాటజీని మార్చారు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ను పూర్తిగా మార్చి.. నేడు ఉదయం సభలో రిపోర్టు ప్రవేశ పెట్టి, చర్చ పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చారు. సభలోనే సిట్ లేదా సీఐడీకి విచారణ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఆయన ప్రకటన చేసే అవకాశముంది. ఒక సారి అసెంబ్లీ నిర్ణయం తీసుకున్న తర్వాత చట్టసభల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు. వాస్తవానికి రేవంత్‌రెడ్డి నేడు కేరళలో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ నియోజకవర్గంలో జరిగే ప్రోగ్రామ్‌కు వెళ్లాల్సి ఉంది. అందుకని అసెంబ్లీకి సెలవు ఇచ్చి రిపోర్టును సోమవారం సభలో ప్రవేశ పెట్టాలని భావించారు. కానీ కోర్టు విచారణకు ముందే సభా కార్యక్రమాలు అన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యూహం మార్చింది. దీంతో బీఆర్ఎస్‌కు షాక్ తగిలిందనే ప్రచారం జరుగుతున్నది.

నేడు హాట్ హాట్‌గా అసెంబ్లీ

నేడు ఉదయం సభ ప్రారంభం కాగానే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘోష్ కమిషన్ నివేదికను సభలో ప్రవేశ పెడతారు. నివేదికపై ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి వచ్చే విమర్శలను ఎలా ఎటాక్ చేయాలో పక్కా ప్లాన్ తయారు చేసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉదయం కేరళకు వెళ్లి మధ్యాహ్నం మూడు గంటలకు అసెంబ్లీకి వస్తారని సమాచారం. ఆయన వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పై తనదైన శైలీలో ఎటాక్ చేయడంతో పాటు కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ చేపట్టేందుకు సిట్ లేదా సీఐడీకి బాధ్యతలు అప్పగిస్తూ సభలో ప్రకటన చేస్తారని తెలుస్తున్నది.

Next Story