Kagar: ఆపరేషన్ కగార్ ను నిలిపివేయండి.. పౌరహక్కుల సంఘాలు డిమాండ్

by Ramesh Goud |
Kagar: ఆపరేషన్ కగార్ ను నిలిపివేయండి.. పౌరహక్కుల సంఘాలు డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆపరేషన్ కగారు వెంటనే ఆపివేయాలని, దేశ సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడానికి కుదుర్చుకున్న ఎంఓయూలను రద్దు చేయాలని పలు ప్రజా, పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. దీనికి సంబంధించి శుక్రవారం పత్రికా ప్రకటనను విడుదల చేశాయి. అందులో భాగంగా చత్తిస్ ఘడ్ అడవుల్లో కొనసాగిస్తున్న హత్యాకాండలను వెంటనే నిలిపివేయాలని కోరారు. ఏడాది కాలంగా జరిగిన, జరుగుతున్న అన్ని ఎన్కౌంటర్లపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. తెలుగు రాష్ట్రాల్లోని హక్కుల సంఘాలైన పౌర హక్కుల సంఘం- తెలంగాణ (సీఎల్ సీ), మానవ హక్కుల వేదిక ( హెచ్ఆర్ఎఫ్), ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడిఆర్), పౌర హక్కుల పరిరక్షణ కమిటీ(పీయూసీఎల్), పౌర హక్కుల పర్యవేక్షణ కమిటి (సీఎల్ఎంసీ) లు తెలంగాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని పోరాడాలని సూచించారు.

ఆదివాసీల హననాన్ని నిలువరించడానికి ,ఉద్యమాన్ని బతికంచుకోవడానికి తమవంతు బాధ్యతగా ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కోట్లాది విలువైన వనరులను బహుళ జాతి కంపెనీలకు, కార్పొరేట్లకు దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై అతి క్రూరంగా మారణకాండను కొనసాగిస్తుందన్నారు. వారికి మద్దతుగా ఉద్యమిస్తున్న ఉద్యమకారులను అత్యంత కిరాతకంగా హత్య చేస్తూ దానికి ఆపరేషన్ కగార్ పేరుతో లక్షలాది బలగాలతో మధ్య భారతాన్ని సరిహద్దు ప్రాంతంగా మారుస్తూ యుద్ధ స్థితిని కొనసాగిస్తుందన్నారు.. చత్తీస్ ఘడ్ లో ఆదివాసీలపై భారత సైన్యం చేస్తున్న దాడిని మానవత్వం గల మనుషులుగా ప్రజాస్వామ్యవాదులుగా అన్ని రాజకీయ పార్టీలు బిజేపి ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండను నిలదీయడానికి ముందుకు రావాల్సిందిగా కోరారు. నిజమైన ఎన్కౌంటర్లయితే నిజనిర్ధారణలు చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు భయపడుతున్నాయో తెలపాలన్నారు. ఆదివాసీలను ఉద్యమకారులను పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి ఎన్కౌంటర్లుగా ప్రకటిస్తున్నారని, అందుకే జరిగిన 300పైగా ఎన్కౌంటర్ హత్యలన్నింటిని ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలన్నారున. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయడానికి మన వంతుగా బాధ్యతగా ప్రజలు, ప్రజాసంఘాలు ప్రజాస్వామిక వాదులు కలిసి రావాలని హక్కుల సంఘాలుగా పిలుపునిస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed