- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iran Israel War: 72 గంటల కాల్పుల విరమణ ప్రకటించాలి: ఇరాన్ ప్రతినిధితో కేఏ పాల్ శాంతి సమావేశం
ప్రజా శాంతి పార్టీ అధినేత, గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక శాంతి సమావేశాన్ని నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజా శాంతి పార్టీ అధినేత, గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ హకీమ్ ఇలైహితో మధ్యాహ్నం భేటీ అయిన ఆయన, ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ కేఏ పాల్ మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే 72 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు, ఇరాన్ అధ్యక్షుడికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విరామం చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు మార్గం సుగమం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫిబ్రవరి 5 నుంచి నిరంతర కృషి.
యుద్ధాన్ని నివారించి, ప్రపంచాన్ని అస్థిరత నుంచి కాపాడేందుకు తాను ఫిబ్రవరి 5, 2026 నుంచి అలుపెరగకుండా శ్రమిస్తున్నట్లు పాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమెరికాతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై అగ్రనేతలను కలిసి దౌత్యపరమైన చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ‘శాంతిని స్థాపించే వారు ధన్యులు. ప్రపంచానికి శాంతిని పొందే అవకాశం ఇవ్వండి’ అంటూ డాక్టర్ కేఏ పాల్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య చారిత్రాత్మక శాంతి చర్చలు జరగాలని, అందుకు దౌత్యమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ వివరాలను ఆదివారం ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు.






