ప్రీతి కుటుంబానికి కేఏ పాల్ కీలక హామీ

by Disha Web Desk 2 |
ప్రీతి కుటుంబానికి కేఏ పాల్ కీలక హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రీతి తరహా ఘటన మరొకటి పునరావృతం కాకుండా అవసరమైనతే చట్టాలలో మార్పులు తీసుకురావాలని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ఆకాంక్షించారు. ప్రీతిది ఆత్మహత్య కాదని హత్య అని ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారని దీనిపై పిల్ వేసేందుకు తాను కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రీతి తండ్రికి మాటిస్తున్నానని న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటాన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన..ప్రీతి ఘటన ఆత్మహత్యే అయితే గనుక అలాంటి నిర్ణయాలు యువత తీసుకోవద్దని కోరారు.

తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యువత ధైర్యంగా ఉండాలన్నారు. ప్రీతిని ర్యాగింగ్ చేసిన వారి ఇంట్లో ఆడపిల్లలు లేరా అని ప్రశ్నించారు. ప్రీతి ఘటనలో కేసీఆర్ ఏమి చేయలేకపోయారని ధ్వజమెత్తారు. ఓ యువతి కోసం తన స్నేహితుడు నవీన్ ను హత్య చేసిన ఘటనపై స్పందిస్తూ.. సదరు యువతిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒకరికి తెలియకుండా మరొకరి జీవితంతో ఆడుకున్న ఆ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలు చూస్తుంటే దేశంలో ఏం జరుగుతోందని అనుమానం కలుగుతోందన్నారు. దేశంలో చట్టాలు ఉన్నప్పటికీ ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.

దేశంలో ఉన్న చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుని కొంత మంది ఆటలాడుతున్నారని హత్యలు చేసి బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. అందువల్ల దేశంలో చట్టాలు మారాలన్నారు. దేశంలో దుష్ట రాజకీయం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి కేసుల్లో కోర్టులు కూడా స్పీడ్ పెంచాలని కోరారు. దయచేసి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని అవసరమైన విషయాలను పిల్లలకు తెలియజెప్పాలన్నారు. పిల్లల తల్లిదండ్రులు ముఖ్యమనే విషయం మర్చిపోకూడదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా అరెస్ట్ అవుతారని ముందే చెప్పానని, ఎవరైనా చట్టానికి అతీతులు కాదన్నారు. ఈ కేసులో చాలా మంది ఉన్నారని వారిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. క్రైమ్ చేసిన వారు తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సిందే అన్నారు.

Next Story