- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెన్షన్ పెట్టిస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్.. భవితవ్యంపై బీఆర్ఎస్ బెంగ
బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టెన్షన్ పట్టుకున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టెన్షన్ పట్టుకున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దాంతో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేలా.. మరోసారి జూబ్లీహిల్స్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు గులాబీ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఒకవేళ ఓడితే భవిష్యత్ పరిణామాలను ఊహించుకొని భయాందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తున్నది. అందుకే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని సమాచారం. అందులోభాగంగానే రోజుకో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేలా..
జూబ్లీహిల్స్ నుంచి రెండు పర్యాయాలు మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అయితే.. ఇటీవల ఆయన అనారోగ్యంతో అకాల మరణం చెందారు. గోపినాథ్ భార్య సునీతకే టికెట్ ఇస్తున్నట్లు ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. గోపినాథ్ ఫ్యామిలీలోనే టికెట్ ఇస్తే గెలుపు సునాయసనం అవుతుందని పార్టీ భావిస్తున్నది. మరోవైపు రోజు వారీగా నియోజకవర్గం బూత్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌గా కేటీఆర్ తెలంగాణ భవన్‌లో కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. వారికి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఫ్యూచర్‌పై భయాందోళన
రాష్ట్రంలో జూబ్లీహిల్స్ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఈ స్థానంలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే భవిష్యత్తులో ఏమవుతుందోనని పార్టీ కీలక నేతలు భయాందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో పార్టీ విజయం సాధించకపోతే కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని వలసలు తప్పవనే భయం పార్టీ పెద్దలను వేధిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అందుకే వీటన్నింటి నుంచి బయటపడేందుకు గెలుపు తప్పనిసరి అని పార్టీ ఉప ఎన్నికలను చాలెంజింగ్‌గా తీసుకున్నది.
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకే ఇన్‌చార్జి బాధ్యతలు
సాధారణంగా ఏ ఎన్నిక వచ్చినా ఆయా నియోజకవర్గానికి సంబంధించిన వారికే ఇన్‌చార్జి బాధ్యతలు ఇస్తుంటారు. కానీ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారడంతో నియోజకవర్గ కార్యకర్తలను నమ్మకుండా.. ఎమ్మెల్సీలకు బాధ్యతలు ఇచ్చారు. రహమత్‌నగర్ ను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు, యూసుఫ్‌గూడను పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి, షేక్‌పేటను దాసోజు శ్రవణ్‌కు కేటాయించారు. అలాగే.. బోరబండను ఎమ్మెల్యే వివేకానందకు, వెంగళరావునగర్‌ను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి, ఎర్రగడ్డ డివిజన్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అప్పగించారు. నియోజకవర్గంలో ఏదైనా అన్నీ వీరి కనుసన్నల్లోనే జరగాలని పార్టీ డిసైడ్ చేసిందని సమాచారం.






