- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HUJ: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు ఇవ్వండి
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు ఇవ్వండి

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(HUJ-TWJF) కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగిసి 18నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ పొడిగింపు స్టిక్కర్లతోనే సమాచార శాఖ కాలం గడుపుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అక్రిడిటేషన్ పాలసీని ప్రకటించకపోవడం జర్నలిస్టులపై ప్రభుత్వానికున్న వైఖరికి నిదర్శనమని హెచ్‌యూజే కార్యవర్గం పేర్కొంది.
శుక్రవారం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో హెచ్ యూజే అధ్యక్షుడు బి.అరుణ్ కుమార్ అధ్యక్షతన ఆ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. వృత్తిపరంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇతర సమస్యలపై నాయకులు కూలంకుషంగా చర్చించారు. జర్నలిస్టులకు ఇండ్ల జాగాల విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు తీర్పుతో సమస్య జటిలమైందనీ, ఈ నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా జర్నలిస్టులకు న్యాయం చేసేలా ప్రత్యేక పాలసీ తీసుకురావాలని హెచ్ యూజే కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు అన్ని ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యచికిత్సలు అందేలా హెల్త్ కార్డులను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.
సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీడబ్ల్యూజేఎఫ్ సీనియర్ ఉపాధ్యక్షులు, అడ్ హక్ కమిటీ కన్వీనర్ పిల్లి రాంచందర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి హెచ్‌యూజే నాయకులు కృషి చేయాలన్నారు. సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జనవరి మొదటి వారంలోనే హెచ్ యూజే నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించుకోవాలని, ఆ దిశగా కార్యవరం పని చేయాలని ఆకాంక్షించారు. ఫెడరేషన్ ఉపాధ్యక్షులు గుడిగ రఘ మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను రద్దు చేసి కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
హెచ్ యూజే కార్యదర్శి జగదీశ్వర్ మాట్లాడుతూ.. సంఘం కార్యక్రమాలను వివరించారు. సభ్యత్వ నమోదు పూర్తిచేసి డిసెంబర్ చివరి వారంలో సంఘం మహాసభ నిర్వహిస్తామని చెప్పారు. హెచ్ యూజే అధ్యక్షుడు బీ.అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హెచ్ యూజే వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై హెచ్ యూజే, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాలు మాత్రమే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని అన్నారు. కోశాధికారి బి. రాజశేఖర్.. సంఘ నిర్మాణం, సభ్యత్వాలు, ఇతర అంశాలను వివరించారు.
కాగా, నియోజకవర్గ మహాసభలు పూర్తి చేసుకొని డిసెంబర్ చివరి నాటికి హెచ్ యూ జే మహాసభ నిర్వహించాలని, సంఘ నియమాలను అతిక్రమించిన సభ్యుడు మామిడి సోమయ్య ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయాలని కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఇటీవల కాలంలో మృతిచెందిన జర్నలిస్టులకు సంతాప సూచకంగా సమావేశం ప్రారంభంలో కార్యవర్గం రెండు నిమిషాలు మౌనం పాటించింది. సమావేశానికి టీడబ్ల్యూజేఎఫ్రాష్ట్ర నాయకులు సలీమా, రాధిక, నిరంజన్, హెచ్ యూజే నాయకులు మధుకర్, రమేష్, బాలు, నిస్సార్, లలిత, విజయ, ప్రశాంత్, రేణయ్య, లక్ష్మణ్ రావు, రాజేశ్, మాధవ రెడ్డి, కాలేబ్, సర్వేష్, శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.






