ధరణి ప్రక్షాళన షురూ.. కొత్త సమస్యలు రాకుండా ‘భూమాత’ రూపకల్పన!

by Disha Web Desk 2 |
ధరణి ప్రక్షాళన షురూ.. కొత్త సమస్యలు రాకుండా ‘భూమాత’ రూపకల్పన!
X

2017:

భూ రికార్డుల ప్రక్షాళనలో ఓ ప్రధాన సమస్య వచ్చింది. రికార్డుల్లో భూ విస్తీర్ణం పెరిగింది. సేత్వార్ ప్రకారం చూస్తే కనీసం 10 నుంచి 15 శాతం ఎక్కువగా కనిపిస్తున్నది. దీనికి పరిష్కారం చూపించాలని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమీక్షలో అప్పటి ప్రభుత్వం అడిగింది. దానికి.. ఓ ఐఏఎస్ అధికారి.. ‘సర్వే నంబరులో ఎంత ఉండాలో అంత వరకే నమోదు చేయండి. ఎవరో ఒకరి ఖాతా నుంచి డిలీట్ చేయండి. ఇప్పటికైతే రికార్డులు క్లియర్ గా ఉంటాయి. ఆ తర్వాత సమస్య ఉందని ఎవరైనా దరఖాస్తు చేస్తే పరిష్కరిద్దాం’ అంటూ సలహా ఇచ్చారు. అప్పటికైతే గండం గడుస్తుందని అందరూ ఉన్నతాధికారులు దానికి ఓకే చెప్పారు. ఆయన సూచన ప్రకారమే డేటాను అప్ లోడ్ చేసి ధరణి పోర్టల్ లో డేటాని 100 శాతం క్రోడీకరించామని చెప్పుకున్నారు. కానీ తమ విస్తీర్ణం తగ్గిందంటూ ఎన్ని లక్షల మంది గగ్గోలు పెడతారన్న విషయాన్ని గుర్తించలేదు. అలా ధరణి డేటా సృష్టించిన కారణంగానే ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ అంటూ ఫైళ్లను తిరస్కరిస్తున్నారు. భూమి ఉన్నోళ్లకు రికార్డుల్లో లేదు. రికార్డుల్లో ఉన్నోళ్లకు భూమి లేదు. అయితే ఆ సలహా ఇచ్చిన అధికారి మాత్రం కేంద్ర సర్వీసులోకి వెళ్లిపోయారు. ఇప్పుడిక్కడ రైతులేమో సీసీఎల్ఏ చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్నారు.

2024:

తెలంగాణలో గడిచిన నాలుగేండ్లుగా భూ సమస్యలు పెరిగాయి. ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలు లక్షల్లో ఉన్నాయి. లక్షలాది మంది తమ భూమి హక్కులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ధరణి పోర్టల్ స్థానంలో భూమాతను ప్రవేశపెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ మార్పుతో పాటు భూ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఇప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవు. 2017 లో చేసిన పొరపాట్లను పునరావృతం కాకూడదని ప్రభుత్వం యోచిస్తున్నది. ఎలాంటి కొత్త సమస్యలు తలెత్తకుండా, ఉన్న వాటికి శాశ్వత పరిష్కారాన్ని కనుక్కునేందుకు శోధిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: భూ రికార్డుల ప్రక్షాళనలో ఉన్న సమస్యల పరిష్కారం కంటే.. కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిసినా కొందరు ఐఏఎస్ అధికారుల సూచనలను సీఎం కేసీఆర్ అమలు చేశారు. దాంతో ధరణి పోర్టల్‌లో బాధితుల సంఖ్య లక్షల్లో కనబడింది. ఇప్పుడూ అలాంటి తప్పిదాలకు తావు లేకుండా చేయాలని సర్కారు పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నది. అధికారులు, నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చిస్తున్నారు. పరిష్కార మార్గాలను వెతకడంలో నిమగ్నమయ్యారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ సమస్యలపై క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు.

మిస్టేక్స్ రిపీట్ కాకుండా..

2017 సెప్టెంబరు 15 నుంచి డిసెంబరు 31 వరకు నిర్దిష్ట సమయంలో అప్పటి ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేసింది. ఆ తర్వాత ల్యాండ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా అక్యూరేట్ ల్యాండ్ రికార్డులను రూపొందించామని వెల్లడించింది. 93 శాతం భూమి హక్కులు క్లియర్ చేశామని పేర్కొన్నది. 2018లో 1.4 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి గాను 60 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసినట్లు పేర్కొన్నది. ధరణి పోర్టల్ ప్యూరిఫైడ్ డేటానే ఎంట్రీ చేశామని, తప్పులకు ఆస్కారమే లేదని చెప్పింది. ధరణి పోర్టల్ ను అమల్లోకి తీసుకొచ్చే ముందే ‘తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ యాక్ట్ -1971’ ప్రకారం డేటాను ఎలక్ట్రానిక్ ఫార్మెట్ లోకి తీసుకొచ్చామని వెల్లడించింది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపించాయి. అనేక సమస్యలు తలెత్తాయి. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక విమర్శలొచ్చాయి. 33 మాడ్యూళ్లను అమల్లోకి తీసుకొచ్చినా పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగాయి. అందుకే భూమాత వెబ్ పోర్టల్ రూపకల్పనకు ముందే నాటి తప్పిదాలు పునరావృతం కాకుండా వ్యూహరచన చేస్తున్నారు.

పైలెట్ ప్రాజెక్టుతో గుర్తింపు

రాష్ట్ర వ్యాప్తంగా అనేక భూ సమస్యలకు ధరణి పోర్టల్, కొత్త ఆర్వోఆర్ యాక్ట్ ద్వారా పరిష్కారం కనిపించడం లేదు. అలాగే 33 మాడ్యూళ్ల ద్వారానూ రైతుల అప్లికేషన్లు తగ్గడం లేదు. క్షేత్ర స్థాయిలోనూ అనేక వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ (లీఫ్స్) వంటి సంస్థతో పైలెట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని తెలిసింది. కొన్ని మండలాలు, కొన్ని గ్రామాల యూనిట్ గా సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా పరిష్కార మార్గాలను గుర్తించాలని యోచిస్తున్నారు. భూమాత వెబ్ పోర్టల్ తయారీ కంటే ముందే గ్రౌండ్ రిపోర్ట్ అధ్యయనం మంచిదని రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు భూ సమస్యల పరిష్కారానికి ఓ కమిటీని వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం గమనార్హం. అందుకే ఇప్పట్లో భూమాత, కొత్త భూ పరిపాలనకు అవకాశాలు కనిపించడం లేదు.


Next Story

Most Viewed