ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోకపోవడం దారుణం.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-12 03:39:50  IST  )

తాము అధికారంలోకి వస్తే ఔట్‌సోర్సింగ్‌లో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ (Congress) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోకపోవడం దారుణం.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తాము అధికారంలోకి వస్తే ఔట్‌సోర్సింగ్‌లో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ (Congress) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడంతో ఇవాళ తెలంగాణ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ జేఏసీగా ఏర్పడి ఇవాళ ‘చలో హైదరాబాద్‌’కు పిలుపునిచ్చారు. తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరా పార్క్‌ (Indira Park) వేదికగా మహాధర్నా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేపడుతోన్న ధర్నాకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ జాగృతి చీఫ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు.

ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం స్పెషల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని అన్నారు. కేసీఆర్ (KCR) ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచి వారు తలెత్తుకుని జీవించేలా చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అయిన పీఆర్సీని వర్తింపచేశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని.. వెంటనే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎమ్మెల్సీ కవిత రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.

Next Story