Film industry: మూవీ లవర్స్ vs నిర్మాతలు.. పైరసీ భూతం అంతం కాదా?

by Ramesh Naini |

సినీ పరిశ్రమను పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. దశాబ్దకాలంగా సినీ ఇండస్ట్రీకి రూ.వందల కోట్ల నష్టం వాటిల్లేలా చేసిన పైరసీ అంతం పై స్పష్టత లేదు.

Film industry: మూవీ లవర్స్ vs నిర్మాతలు.. పైరసీ భూతం అంతం కాదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సినీ పరిశ్రమను పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. దశాబ్దకాలంగా సినీ ఇండస్ట్రీకి రూ.వందల కోట్ల నష్టం వాటిల్లేలా చేసిన పైరసీ అంతం పై స్పష్టత లేదు. తాజాగా అరెస్ట్ అయిన ఐ బొమ్మ నిర్వాహకుడి వద్ద 21 వేల సినిమాల డేటా ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పడం సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది. 1972లో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన సినిమాల డేటా అతని వద్ద ఉందని చెబుతున్నారు. అయితే పైరసీ వెబ్‌సైట్‌ల నిర్వాహకులు మూడు పదుల వయస్సు గలవారే కావడం గమనార్హం. కొందరు ఇంటర్ చదివి హ్యాకింగ్ నేర్చుకుని సినిమాలను అన్‌లైన్ ద్వారా ప్రదర్శించే క్యూబ్, యూఎఫ్‌వో వంటి మీడియా హౌస్‌లను హ్యాక్ చేయడం చిత్ర పరిశ్రమను కలవరపెడుతున్నది.

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో ఆరితేరి..

డిజిటల్ యుగంలో సినిమా పైరసీ కట్టడిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పైరసీని నివారించడం సాధ్యమయ్యే పని కాదని పలువురు చెబుతుండటం గమనార్హం. గతంలో థియేటర్లలో కెమెరాలతో రికార్డు చేసి పైరసీ చేసిన వారు ప్రస్తుతం అంతకు పది రెట్ల అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారని చెబుతున్నారు. డిజిటల్ యుగంలో పైరసీ కొత్త రూపాలు సంతరించుకుంటుందని, భవిష్యత్తులో పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉంటాయని సినీ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెదర్లాండ్స్, యూకే, ఫ్రాన్స్, యూఎస్ఏ నుంచి పైరసీ వెబ్‌సైట్లను అపరేట్ చేస్తున్నారని, వారిని ఇండియాకు తీసుకురావడం సాధ్యమయ్యేలా కనిపించడంలేదని పేర్కొంటున్నారు. ఇటీవల అరెస్ట్ అయిన వారిలో బిహార్‌కు చెందిన యువకుడు సినిమాను రిలీజ్‌కు ముందే చూడాలనే కుతూహలంతో క్యూబ్‌ను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. అతడి వద్ద 700 సినిమాల డేటా బయట పడిందని పోలీసులు తెలిపారు. 2024లో పైరసీ కారణంగా సినీ ఇండస్ట్రీకి రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు సినీ నిర్మాతలు చెబుతున్నారు. ఐ బొమ్మ వైబ్‌సైట్ నిర్వాహకుడి వద్ద 21 వేల సినిమాల డేటా ఉందని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.

టికెట్ రేట్లపై మూవీ లవర్స్ ఆగ్రహం

సినిమా టికెట్ల ధరలు అధికంగా పెరగడంతో మూవీ లవర్స్ ఐ బొమ్మ వంటి పైరసీ వెబ్‌సైట్లకు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు. అయితే చిత్ర నిర్మాణానికి అధిక బడ్జెట్ అవుతుండడంతో టికెట్ల ధరల పెంపు తప్పడం లేదని సినీ నిర్మాతలు చెబుతున్నారు. టికెట్ రెట్లు సామాన్యుడికి అందుబాటులోకి వస్తేనే పైరసీకి కళ్లెం పడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మల్టీఫ్లెక్స్‌కు వెళ్లాలంటేనే జనం జంకుతుండగా ఫ్రీగా చూసేందుకు పైరసీ వెబ్ సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల అరెస్ట్ అయిన ఐ బొమ్మ, ఇతర పైరసీ వెబ్‌సైట్ల నిర్వహకుల అరెస్ట్‌పై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ పుట్టుకొచ్చాయి. కొన్ని సందర్భాల్లో పైరసీ వైబ్‌సైట్ నిర్వాహకులను రాబిన్ హుడ్‌తో పోల్చుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం గమనార్హం.

ఫ్రీ కాదు.. మీ డేటా కాజేస్తున్నారు

సినిమాలను పైరసీ చేసి వెబ్‌సైట్లలో ఉంచుతున్న వారు ఫ్రీగా సర్వీస్ చేయడం లేదని, బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ ప్రజల వ్యక్తిగత డేటా కాజేస్తున్నారని టాలీవుడ్ నిర్మాతలు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైమ్ బాధితుల్లో ఎక్కువగా పైరసీ వెబ్‌సైట్లను చూసిన వారేనని చెబుతున్నారు. గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ద్వారా రూ.కోట్లు కొల్లగొట్టినట్లు సైబర్ క్రైమ్ నివేదికలు తెలుపుతున్నాయని అంటున్నారు. డిజిటిల్ అరెస్ట్‌లు కూడా వ్యక్తి గత డేటా చోరీ అవడం ద్వారానే చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు. ప్రజల్లో అవగాహన, అప్రమత్తత ద్వారా మాత్రమే సినీ పైరసీకి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.

Next Story