ఆర్టీసీ లాభాల్లో ఉందా.. మరి రిటైర్డ్ కార్మికుల కష్టాలేంటి: ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

by Kema Shiva Kumar |

ఆర్టీసీని తమ మాతృ సంస్థగా భావించి దశాబ్దాల పాటు ఆ సంస్థకు సేవలందించిన కార్మికులు పదవీ విరమణ తర్వాత అష్టకష్టాలు పడుతున్నారు.

ఆర్టీసీ లాభాల్లో ఉందా.. మరి రిటైర్డ్ కార్మికుల కష్టాలేంటి: ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీని తమ మాతృ సంస్థగా భావించి దశాబ్దాల పాటు ఆ సంస్థకు సేవలందించిన కార్మికులు పదవీ విరమణ తర్వాత అష్టకష్టాలు పడుతున్నారు. డ్యూటీ దిగిపోయి ఏండ్లు గడుస్తున్నా.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌‌ అందకపోవడంతో గౌవరప్రదమైన జీవితం గడపలేకుపోతున్నారు. లీవ్‌‌ ఎన్‌‌క్యాష్‌‌మెంట్‌‌ అమౌంట్‌తో పాటు, సీసీఎస్‌‌ చెల్లింపులు ఏడాదిగా పూర్తిగా నిలిచిపోయాయి. 2017 వేతన సవరణకు సంబంధించిన ఏరియర్స్‌‌ పెండింగ్‌‌లో ఉండటం వల్ల దుర్భర జీవితం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఇటీవల రాష్ట్రంలోని పలు డిపోల ఎదుట ఆందోళన బాట పట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చొరవ చూపి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

అయితే, తాజాగా ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల కష్టాలపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్వీట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ఆకలి కేకలు పెడుతున్నారని మండిపడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక, పింఛన్ అందక పూట గడవడానికి 15 వేల మంది కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. సంస్థ లాభాల్లో ఉందని చెబుతూ.. ఇన్నాళ్లూ సంస్థ కోసం శ్రమించిన కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. పెండింగ్ బకాయిలు, పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరిగి కార్మికులు విసిగిపోయారని అన్నారు. పెండింగ్ ప్రయోజనాలను ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పని ప్రభుత్వ పెద్దల తీరు చూసి.. ఇక నుంచి ప్రతి సోమవారం ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు నిరసన తెలపాలని నిర్ణయం తీసుకోవడం సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎత్తి చూపుతోందని అన్నారు. పెన్షన్ సదుపాయమే లేకుండా ఉద్యోగంలో చేరి తక్కువ వేతనాలతో పనిచేసిన శ్రామిక్, డ్రైవర్, కండక్టర్ క్యాడర్ కార్మికుల పరిస్థితి మరింత ఘోరంగా ఉందన్నారు. 16 వేల మంది కార్మిక కుటుంబాలకు ఇకనైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని, వారి పింఛన్లు క్రమం తప్పకుండా మంజూరు చేయాలి కవిత డిమాండ్ చేశారు.

Next Story