- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో మళ్లీ సాగునీటి సంఘాలు
రాష్ట్ర రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో రైతు కమిషన్ సక్సెస్ అయింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో రైతు కమిషన్ సక్సెస్ అయింది. రైతును రాజు చేయాలనే సంకల్పంతో నిత్యం రైతన్నలతో సమావేశాలు నిర్వహిస్తూ రేవంత్ సర్కార్ కు నివేదికలు ఇస్తుంది. ఈ పరంపరలో సాగునీటి సంఘాల ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషిస్తున్నది. రాష్ట్రంలో చాలా చెరువులు, కుంటలు రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లో కబ్జాకు గురవుతున్నాయి. కొందరు అక్రమార్కులు వెంచర్లు వేసి అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు.
చెరువుల పరిరక్షణ బాధ్యతను గత ప్రభుత్వం సక్రమంగా చేపట్టలేదనే అపవాదు ఉన్నది. పైగా చెరువులను అభివృద్ధి చేయకపోవడంతో భూగర్భజలాలూ దెబ్బతిన్నాయి. దీంతో గ్రామాల్లో ఉన్న చెరువుల రక్షణ, భూగర్భజలాలను కాపాడేందుకు నీటి సంఘాలు అవసరమని రైతు కమిషన్ సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో దసరా తర్వాత సాగునీటి సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. సంబంధిత ప్రక్రియపై కసరత్తు జరుగుతున్నది.
గతంలో ఘనమైన పాత్ర
సాగునీటి నిర్వహణలో ఈ సంఘాల గతంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషించాయి. అందరికీ సమానంగా నీరు అందేలా చూడటం, నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా నీటి వృథాను తగ్గించడం, కాల్వల శుభ్రంగా ఉంచడం, వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించడం, నీటి నాణ్యతను కాపాడడానికి చర్యలు తీసుకోవడం, నీటి వినియోగంలో రైతుల మధ్య సహకారాన్ని పెంపొందించడం సాగునీటి సంఘాల ప్రధాన విధులుగా ఉండేవి. గతంలో సాగునీటి సంఘాలు ఘనమైన పాత్ర పోషించాయి. వాటికి పూర్వ వైభవం తీసుకు రావాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి నివేదించింది.
రైతులకు దన్నుగా కమిషన్
ములుగు జిల్లాలో గిరిజన రైతులకు జరిగిన అన్యాయంపై కంపెనీల ప్రతినిధులు, మధ్యదళారులతో చర్చలు జరిపి సీడ్ కంపెనీల నుంచి రైతు కమిషన్ రూ.4 కోట్ల పరిహారం ఇప్పించింది. గద్వాలలో పత్తి, సూర్యాపేటలో వరి, ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తి రైతులకు నష్టపరిహారం ఇప్పించింది. ఈ క్రమంలోనే రేవంత్సర్కారు నకిలీ విత్తన తయారీదారుల భరతం పట్టేందుకు విత్తన చట్టం రూపకల్పన కు శ్రీకారం చుట్టింది. ఇతర రాష్ట్రాల్లోని చట్టాలను పరిశీలించడం తో పాటు రైతు సంఘాలు, రైతులతో సమావేశమై నివేదిక సిద్ధం చేసింది. ప్రభుత్వానికి రేపోమాపో ఆ నివేదిక ఇవ్వనుంది. అలాగే మనీ ల్యాండరింగ్ చట్టాన్ని తీసుకు వచ్చి రైతులకు అధిక వడ్డీ నుండి ఉపశమనం కలిగించాలని భావిస్తున్నది. వ్యవసాయ శాఖకు వెళ్లాల్సిన రైతులు కమిషన్వెళ్లి తమ సమస్యలను వినవించుకుంటున్నారు. రోజుకు వందలాది మంది అన్నదాతలు వస్తే ఓపికతో కమిషన్సభ్యులు భవానీరెడ్డి, సునీల్, రాములు నాయక్, వెంకన్న యాదవ్, గంగాధర్, గోపాల్‌రెడ్డి, ఏవీఎన్‌రెడ్డి సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఆదర్శ రైతు వ్యవస్థ
పోడు పట్టాలు కలిగిన రైతులకు పంట రుణాలు ఇచ్చేలా రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతులకు పోడు పట్టాలు ఉన్నాయి. కానీ వివిధ కారణాలతో గిరిజన రైతులు పంట రుణాలు పొందలేకపోతున్నారు. బ్యాంకర్లు సైతం లోన్లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఈ విషయం కమిషన్ దృష్టికి రావడంతో ఐటీడీఏ, గిరిజన సంక్షేమశాఖ, బ్యాంకర్లు, ఫారెస్ట్ అధికారులు, గిరిజన రైతులతో సమావేశం నిర్వహించారు. గిరిజన రైతులకు పోడు పట్టాలు ఉంటే తప్పనిసరిగా పంట రుణాలు ఇచ్చేలా చూడాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ విషయంలో చొరవ తీసుకొని పోడు పట్టాలు ఉన్న గిరిజన రైతులకు పంట రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. దసరా తర్వాత ఈ ప్రక్రియ అమల్లోకి రానుంది. ఇక రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి తీసుకురావాలని రైతు కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు మరికొన్ని అంశాలపైనా ప్రభుత్వానికి సూచించింది. వాటిని పరిశీలించి ఆమోదించే పనిలో రేవంత్ సర్కార్ నిమగ్నమైంది. రైతు కమిషన్ ప్రతిపాదనలు అమలు జరిగితే రాష్ట్రంలో రైతన్నలకు మరింత మేలు జరగనుంది.






