దొడ్డిదారిన ప్లాట్ల అమ్మకం.. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రూటే సెపరేట్!

by Disha Web Desk 2 |
దొడ్డిదారిన ప్లాట్ల అమ్మకం.. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రూటే సెపరేట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో 12 జోన్లు ఏర్పాటయ్యాయి. 41 శాతం వ్యవసాయం మాత్రమే చేయాలన్న తలంపుతో కన్జర్వేషన్ జోన్‌గా ప్రకటించారు. కొందరు రియల్టర్లు అగ్గువ ధరకే భూములొస్తున్నాయంటూ ఆ జోన్ పరిధిలో వందలాది ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడేమో గుట్టుచప్పుడు కాకుండా ఆ ల్యాండ్స్ ల్లో వెంచర్లు వేస్తున్నారు. దొడ్డిదారిన ప్లాట్లను అమ్మేస్తూ రూ.కోట్లు కూడగట్టుకునేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులను మెప్పించి అనుమతులు లేకుండానే ప్లాట్ల దందాను నడిపిస్తున్నారు. మేడ్చల్ మండలం రాజబొల్లారంలో కన్జర్వేషన్ జోన్ లో ప్లాట్లు చేస్తున్నారు. అందుకే హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ కి మంగళం పాడారు. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం సకల సౌకర్యాలు కల్పించామంటూ మార్కెటింగ్ చేస్తున్నారు. ఐతే అనుమతులు ఎందుకు తీసుకోలేదని ఎంక్వయిరీ చేస్తే అది పూర్తిగా కన్జర్వేషన్ జోన్ లో ఉన్నదని తేలింది. నేటి ఫామ్ ల్యాండ్.. రేపటి విల్లా ప్లాట్. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేది. ఐటీ, ఫార్మా, యూనివర్సిటీలు, హాస్పిటల్స్, రీసార్టులన్నీ అందుబాటులో ఉండే ప్రాంతం. ఒక్క ప్లాట్ కొనండి. రీసేల్ చేస్తే మల్టిపుల్ ఆదాయం వస్తుంది. ప్రతి 200 గజాల ప్లాట్ లో మూడు మామిడి చెట్లు, మూడు జామ, మూడు సపోటా, మూడు ఆరెంజ్, మూడు దానిమ్మచెట్లను పెట్టి ఇస్తాం.


మేడ్చల్ మండలం రాజబొల్లారంలో భారీ వెంచర్ వేశారు. ఇందులో 40, 30 ఫీట్ల రోడ్లు వేశారు. ఫుట్ పాత్స్, పార్కులు, ఎలక్ట్రిసిటీ సదుపాయం, వీధి దీపాలు, గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓవర్ హెడ్ ట్యాంక్ వంటి ఏర్పాటు చేశారు. ప్రతి ప్లాట్ కి నీటి కనెక్షన్, ప్లాట్ నంబర్లు, లే అవుట్ మొత్తానికి కంపౌండ్ వాల్స్, హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. ఇన్ని చేసినా అనుమతులు మాత్రం పొందలేదు. హెచ్ఎండీఏ, రెరా అనుమతులు ఏవీ లేకపోయినా మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ మాత్రం 80 శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఓకే చెప్పారు. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్లను అడిగితే మౌనం వహిస్తున్నారు. హెచ్ఎండీఏలో రూ.వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిన బాలకృష్ణలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలోనూ కొందరు ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేని వెంచర్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

నిర్మాణం ఎట్లా?

మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రాజబొల్లారం సర్వే నం.197, 198/ఎ, 198/ఆ, 198/ఇ, 198/ఈ, 202/ఈ, 202/రు లలో మొత్తం 61,468 చ.గ.ల స్థలం నాలా కన్వర్షన్ చేశారు. లే అవుట్ లో మాత్రం 17.38 ఎకరాలుగా చూపారు. అందులో 59,273 గజాలు ప్లాట్ల విస్తీర్ణం, గెస్ట్ హౌజ్ 2200 గజాలు, రోడ్లు 2405 గజాలుగా పేర్కొన్నారు. ధరణి పోర్టల్ లో క్యాడస్ట్రల్ మ్యాప్ మాత్రం ఈ గ్రామానికి 169 సర్వే నంబర్ల వరకే చూపిస్తున్నాయి. మొత్తం 386 ఉండగా సగం మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పుడీ వెంచర్ కి సంబంధించిన సర్వే నంబర్లు కూడా లేవు. ఐతే ఇన్ని సదుపాయాలు కల్పిస్తూ ఫామ్ ప్లాట్లుగా బ్రోచర్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 80 శాతం ప్లాట్లు అమ్మేసినట్లు మార్కెటింగ్ సిబ్బంది చెప్పారు. ఈ వెంచర్ లో ప్లాట్ కొనుగోలు చేసిన వారు ఇండ్లు ఎట్లా నిర్మిస్తారు? గజం రూ.13 వేలు వెచ్చించి స్థలాన్ని కొనుగోలు చేస్తే అనుమతులు రాకపోతే అమ్ముకోవడం ఎట్లా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పైగా నేటి ఫామ్ ప్లాట్, రేపటి విల్లా ప్లాట్ అంటూ జనాన్ని మభ్యపెడుతున్నారు. కన్జర్వేషన్ జోన్ లోని స్థలాల్లో విల్లాలు నిర్మించేందుకు ఎవరు అనుమతులు ఇస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వందలాది రిజిస్ట్రేషన్లు

గోదావరి గ్రీన్ ఫామ్స్ పేరిట సర్వే నం.197, 198/అ, 198/ఆ, 198/ఇ, 198/ఈ, 202/ఈ, 202/రు, 256 ల్లో 69696 గజాల్లో లే అవుట్ వేశారు. అది కూడా గోదావరి గ్రీన్ ఫామ్స్ పేరిట ఉన్నది. ఫలానా ప్లాట్ 400 గజాలు. ప్రాపర్టీ విలువ రూ.8.40 లక్షలు మాత్రమే. దీనికి రెండువైపులా 30 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. మరో రెండువైపులా ప్లాట్లు ఉన్నాయంటూ షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో పేర్కొన్నారు. గజం ధర మార్కెట్ విలువ రూ.2100. దాని ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించారు. గోదావరి కన్స్ట్రక్షన్స్ కంపెనీ మీద వల్లమాలిన అభిమానాన్ని చూపిస్తున్నారు. అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయమని చెప్పాల్సిన మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ సేల్ డీడ్స్ చేస్తున్నారు. ఇందులో నాలా కన్వర్షన్ చేశారని పేర్కొన్నారు. ఇందులో ప్లాట్ల నంబర్లతో సహా ఉన్నది. పైగా ఆటోమెటిక్ మ్యుటేషన్ కావడం వల్ల వ్యవసాయేతర ప్లాట్ గా రాజబొల్లారం గ్రామ పంచాయతీలో రికార్డుల ఎంట్రీ జరిగిపోతున్నది. దానికి అసెస్మెంట్ కూడా ఆటోమెటిక్ గా జనరేట్ అవుతున్నది. ఇలా ఒకటీ రెండు కాదు.. వందల్లో ట్రాన్సక్షన్లు పూర్తి చేశారు. ఇక్కడ మరి ప్లాట్లుగా అమ్మేస్తున్నారు కదా.. హెచ్ఎండీఏ, రెరా అనుమతులు ఏవి అన్న ప్రశ్నలేవీ సబ్ రిజిస్ట్రార్ నుంచి రావడం లేదు. నాలా కన్వర్షన్ చేసిన తర్వాత హెచ్ఎండీఏ, రెరా అనుమతులు లేకుండా అలా ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తారు? అలా చేయడం చెల్లదు? అసలు అలా రిజిస్ట్రేషన్లు చేసే పద్ధతే లేదు. అనుమతులు లేకుండా ప్లాట్ నంబరు వేసి రిజిస్ట్రేషన్ చేయడం చట్ట వ్యతిరేకమని ‘దిశ’ సదరు సబ్ రిజిస్ట్రార్లను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు. కనీసం అలా రిజిస్ట్రేషన్ చేయొచ్చునని ఏమైనా సర్క్యులర్ లేదా జీవో కాపీ ఉంటే చెప్పండని అడిగినా స్పందించలేదు.


కన్జర్వేషన్ జోన్

– హెచ్ఎండీఏ 12 జోన్లలో కన్జర్వేషన్ జోన్ 41 శాతం పాత్ర పోషిస్తున్నది.

– మాస్టర్ ప్లాన్ 7200 చ.కి.మీ.లలో 2421 చ.కి.మీ. కన్జర్వేషన్ జోన్ గా ఉన్నది.

– వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత అభివృద్ధి మాత్రమే చేయాలి.

– కన్జర్వేషన్ జోన్ లో ఎలాంటి అనుమతులు లేవు. 2031 వరకు ఇది కొనసాగుతున్నది.

– హెచ్ఎండీఏ అనుమతులు రావు. లే అవుట్లు వేయొద్దు.

– ఆరు సంవత్సరాల అధ్యయనం తర్వాత రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇది.

– పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీలకు అనుమతులు లభిస్తాయి.

– రవాణా సదుపాయాలకు మాత్రమే అనుమతులు ఇస్తారు.

– పరిశ్రమలు, ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు. నిషేదం 100 శాతం ఉంటుంది.

– మరి రాజబొల్లారంలో నాలా కన్వర్షన్ ఎలా చేశారు? ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఎలా అవుతున్నాయి?


Next Story

Most Viewed