ట్రాన్స్‌ఫర్‌కు రూ.లక్షకు పైనే వసూలు.. కేజీబీవీ బదిలీల్లో జోరుగా పైరవీల దందా!

by Disha Web Desk 19 |
ట్రాన్స్‌ఫర్‌కు రూ.లక్షకు పైనే వసూలు.. కేజీబీవీ బదిలీల్లో జోరుగా పైరవీల దందా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేజీబీవీల బదిలీల ప్రక్రియలో పారదర్శకత లోపించింది. రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైంది. తమ సన్నిహితులు, ఆప్తులతో పాటు ఇతరులను నచ్చిన చోటుకు స్థాన చలనం చేయిస్తామంటూ పలువురు దళారులు దందాకు దిగుతున్నారు. ఈ దందాకు కొందరు మంత్రుల పేర్లను సైతం వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇది ఆయా మంత్రులకు తెలియకుండానే జరుగుతోంది. ట్రాన్స్‌ఫర్ కోసం ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.లక్షకు పైగానే వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో అధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఖాళీలున్నాయనే విషయాన్ని బయటపెట్టకపోవడం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. బదిలీ ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కొన్ని ఖాళీలు బ్లాక్

చాలీచాలని వేతనంతో సుదూర ప్రాంతాల్లోని కేజీబీవీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తక్కువ జీతంతో దశాబ్దాలుగా పలువురు ఒకే చోట పనిచేస్తున్నారు. తమను బదిలీ చేయాలని ఉద్యోగులు పదే పదే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా ఎట్టకేలకు బదిలీలకు అనుమతించింది. కొందరు బదిలీల్లో అక్రమాలకు తెరదీశారు.

పారదర్శకతకు పాతరేసి తమ అనుకుంటే చాలు అర్హత లేకున్నా, దరఖాస్తు చేయకున్నా అనుకూలమైన చోటుకు బదిలీ చేసేలా పైరవీ చేస్తున్నారు. బదిలీ ప్రక్రియ ఆన్‌లైన్ విధానమే అయినా పలువురు అధికారులతో కుమ్మక్కై పలు స్థానాలు ముందుగానే బ్లాక్ చేయించి తమకు నచ్చిన వారిని ట్రాన్స్‌ఫర్ చేయిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

బదిలీకి రూ.లక్షకుపైగానే

వ్యక్తిగత అవసరాలు, భార్యాభర్తలు ఉద్యోగులు, అనారోగ్యం తదితర కారణాలతో అనుకూలమైన ఖాళీ స్థానాల్లో బదిలీకి దరఖాస్తు చేసిన ఉద్యోగులకు ఆప్షన్స్ ఇచ్చుకునే సమయానికి తాము కోరుకున్న స్థానం కనపించడంలేదు. ఎప్పటి నుంచో ఖాళీగా ఉండి బదిలీలకు ముందు డీఈవో కార్యాలయం ప్రకటించిన ఖాళీల జాబితాలో ఉన్న పోస్టులు ఆప్షన్లు ఇచ్చుకునే సమయానికి మాయమైపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.

దీనిపై సంబంధిత అధికారులను ఆరా తీయగా అవహేళన చేసినట్లుగా మాట్లాడారని తెలిసింది. ఉపాధ్యాయ సంఘ నాయకులు ఈ అంశమై ప్రశ్నించగా పైవారి ఆదేశాల మేరకే కొన్ని ఖాళీలను బ్లాక్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. అనుకున్న చోటుకు బదిలీ కావాలంటే ఒక్కొక్కరి నుంచి రూ.లక్షకు పైగానే వసూలు చేస్తున్నట్లు సమాచారం.

పారదర్శకత పాటించాలి

కేజీబీవీల బదిలీల్లో పారదర్శకత పాటించాలి. కొన్ని జిల్లాల్లో ఉన్న కేజీబీవీలు బదిలీ కాకుండానే ఆ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బ్లాక్ చేసిన ఖాళీలన్నింటినీ ఓపెన్ చేయాలి. అక్రమాలను అరికట్టకుంటే తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది.

- చావ రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఎస్ యూటీఎఫ్


Next Story