KTR: అంతర్జాతీయ సమావేశాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

by Disha Web Desk 2 |
KTR: అంతర్జాతీయ సమావేశాలకు కేటీఆర్‌కు ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ పర్యావరణ - జలవనరుల సమావేశాల్లో కీలకోపన్యాసం చేయాలని మంత్రి కేటీఆర్‌ను అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ నేతృత్వంలోని పర్యావరణ-నీటి వనరుల సంస్థ ఆహ్వానించింది. అమెరికా హెండర్సన్‌లో మే 21 -25 తేదీల మధ్య ప్రపంచ పర్యావరణ-జలవనరులపై సమావేశాలు జరుగనున్నాయి. ఆరేళ్ల క్రితం 2017 మే 22న అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక వార్షికోత్సవంలో కేటీఆర్ పాల్గొని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలు, ఈ భారీ నీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న లక్ష్యాన్ని వివరించారు.

అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ పర్యావరణ-నీటి వనరుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ పార్సన్స్‌తో పాటు అధ్యక్షుడిగా ఎన్నికైన షిర్లీ క్లార్క్ నాయకత్వంలో ఓ ప్రతినిధి బృందం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. కేసీఆర్ మొదలుపెట్టిన పలు నీటి పారుదల ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రంలో కలిగిన సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ప్రశంసించింది. ఈ మెగా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అవలంభించిన విధానాలతో పాటు సస్యశ్యామల మాగాణంగా తెలంగాణ మారిన క్రమాన్ని సమావేశాల్లో వివరించాలని కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన లేఖలో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ పర్యావరణ-నీటి వనరుల సంస్థ కోరింది. 1852లో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ లో 177 దేశాలకు చెందిన 150,000 కంటే ఎక్కువ మంది సివిల్ ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నారు. భవిష్యత్ తరాల కోసం పర్యావరణ సమస్యల పరిష్కారంతో పాటు నీటి వనరుల సంరక్షణపై ఈ సొసైటీ పనిచేస్తుంది.


Next Story

Most Viewed