- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ వివాహం జంటలను వరించని లక్ష్మీదేవి.. పట్టించుకోని రేవంత్ సర్కార్
సమాజంలో కులనిర్మూలన, వివక్షను పోగొట్టేందుకు ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సాహిస్తుంది.

దిశ, వెబ్‌డెస్క్ : కులం కార్డుకు ఎండ్ పలకడానికి, కుల వివక్షను సమూలంగా నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులాంతర వివాహాలను(Intercaste Marriage Incentive Scheme) ప్రోత్సహిస్తున్నాయి. షెడ్యూల కులాల వారిని వివాహం చేసుకుంటే వారికి రూ.2.50 లక్షలను ప్రోత్సాహకంగా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ఒక అడుగు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్నచందంగా ఈ ప్రోత్సాహకాలు అటకెక్కుతున్నాయి. కులాంతర వివాహాలపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, దరఖాస్తు చేసుకున్నా ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడుతుండటంతో లబ్ధిదారులు నిరుత్సాహపడుతున్నారు.
ప్రోత్సాహకం భళా.. ఆచరణలో డీలా
సమాజంలో కులనిర్మూలన, వివక్షను పోగొట్టేందుకు ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సాహిస్తుంది. 1980లో ప్రారంభమైన ఈ పథకం.. మొదట్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న జంటలకు రూ.30 వేలు అందించేవారు. ఆ తర్వాత 13 ఏళ్లకు అంటే 1993 నుంచి రూ.40 వేలు, 2011 నుంచి రూ.50 వేల చొప్పున అందించారు. ఈ డబ్బులు ఏమాత్రం సరిపోవని భావించిన ప్రభుత్వం 2019 అక్టోబర్ నుంచి రూ.2.50 లక్షలు అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇచ్చే ఈ ప్రోత్సాహకాన్ని నేరుగా లబ్ధిదారుల చేతికి అందించరు. కొత్త జంట జాయంట్ అకౌంట్ తీసి ఈ డబ్బులను మూడేళ్ల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. కులాంతర వివాహం చేసుకున్న జంటలు ఏడాది లోపు తన వివాహాన్ని 1955 వివాహచట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోని ఈ-పాస్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తున్న జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేస్తే ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది.
కుప్పలుగా దరఖాస్తులు
ప్రభుత్వ లెక్కల ప్రకారణమే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్ స్కీమ్‌కు ప్రతి ఏటా సుమారు 1,000 నుండి 3,000 జంటలు దరఖాస్తు చేసుకుంటున్నాయి. వీటిల్లో పావువంతు మందికి కూడా లబ్ధి చేతికి అందడం లేదు. ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఉదాహారణకు తీసుకుంటే.. గతేడాది 1026 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోని ఎదురు చూస్తున్నారు. ఈ ఒక్క జిల్లాకే రూ.25.04 కోట్లు ప్రభుత్వం బాకీ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తును క్లియర్ చేయడానికి దాదాపు రూ.320 కోట్లు అవసరమని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. 2025 డిసెంబర్ చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 994 జంటలకు సర్కార్ రూ.24.85 కోట్లను మాత్రమే అందజేసింది. వీటిల్లో పెద్దపల్లి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల చెందిన జంటలు ఉన్నాయి.
ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలి. మొదటి పెళ్లి చేసుకునే వారే అర్హులు. వివాహమైన సంవత్సరంలోపు ఈ-పాస్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్, రేషన్ కార్డు, ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, దంపతుల 3 ఫొటోలు సమర్పించాలి. దరఖాస్తు చేశాక ఆన్‌లైన్ కాపీని జిల్లా ఎస్పీ అభివృద్ధి కార్యాలయంలో అందజేయాలి. అర్హులని గుర్తిస్తే దంపతుల జాయంట్ అకౌంట్‌లో రూ.2.50 లక్షలను జమ చేస్తారు. ఈ మొత్తాన్ని మూడేళ్లపాటు ఫిక్స్డ్డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాతనే ఆ డబ్బులను తీసుకునే అవకాశంఉంటుంది.
ప్రజల్లో అవగాహన ఏది..?
కులాంతర వివాహాలపై నేటికీ ప్రజల్లో అవగాహన లేదనే చెప్పాలి. చదువుకున్న వాళ్లలో కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఉందని తెలియదంటే అతిశయోక్తి కాదు. దీనివల్లనే పట్టణాలు, నగర ప్రాంతాల్లో కులాంతర వివాహాలు జరిగినా దరఖాస్తులు మాత్రం రావడం లేదు. ఇక గ్రామీణ యువత కులాంతర వివాహం చేసుకున్నా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రయోజనం పొందకుండా మిగిలిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కల్పించడంతోపాటు గ్రామ స్థాయిలో అవగాహన శిబిరాలు, ప్రచార కార్యక్రమాలు చేపడితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్ స్కీమ్ విజయవంతం అయ్యే అవకాశముంది. కులాంతర వివాహాల సంఖ్య పెరిగినప్పుడే పరువు హత్యలు ఆగిపోనున్నాయి.






