ఇరిగేషన్ శాఖలో జోరుగా బదిలీల పైరవీలు.. చక్రం తిప్పుతున్న ఇద్దరు అధికారులు!

by Kema Shiva Kumar |

ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యాలయం ‘జలసౌధ’లో బదిలీలు, ప్రమోషన్ల పర్వంలో చక్రం తిప్పుతున్న ఇద్దరు అధికారుల గుట్టు తెలిసింది.

ఇరిగేషన్ శాఖలో జోరుగా బదిలీల పైరవీలు.. చక్రం తిప్పుతున్న ఇద్దరు అధికారులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జలవనరుల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో ప్రమోషన్లు, బదిలీల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. శాఖలో ఏ ఉద్యోగికి ప్రమోషన్ రావాలన్నా, ఏ అధికారి బదిలీ జరగాలన్నా.. అధికారిక ప్రక్రియ కంటే ముందు ఇద్దరు అధికారుల ఆమోదమే కీలకంగా మారిందనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన ప్రాథమిక జాబితాలు ఈఎన్సీ (అడ్మిన్) కార్యాలయంలో కాకుండా.. ముందుగా ఈ ఇద్దరు అధికారుల వద్దే సిద్ధమవుతున్నదని టాక్. ఎవరి పేరు ఉండాలి? ఎవరి పేరు తొలగించాలి? ఎవరిని ఏ జిల్లాకు పంపాలి? ఎవరికి కీలక పోస్టింగ్ ఇవ్వాలి? వంటి అంశాలపై ముందుగానే నిర్ణయాలు తీసుకొని.. అదే జాబితాను ఈఎన్సీ కార్యాలయానికి పంపుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఆ తర్వాత అదే జాబితాకు ఈఎన్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. మంత్రి, శాఖ కార్యదర్శి ఆమోదానికి పంపుతున్నారని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతున్నది. దీంతో అసలు నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

జలసౌధలో ఆయనకేం పని?

మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న ఓ డిప్యూటీ ఈఈ స్థాయి అధికారి నిత్యం జలసౌధకు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పని చేసే చోట కేటాయించిన పోస్టులో ఉండి.. క్వాలిటీ కంట్రోల్ వింగ్ చూడాల్సి ఉంది. అక్కడే ఏ పని జరిగినా.. దాని మీద ఇన్‌స్పెక్షన్ చేయాల్సి ఉంది. కానీ.. ఈయన మాత్రం నిత్యం జలసౌధకు వచ్చి అధికారుల బదిలీలు, ప్రమోషన్ల వ్యవహారం చూస్తుండడం చర్చకు దారితీసింది. ప్రమోషన్ల అధికారుల జాబితా తయారుచేయడం.. బదిలీల విషయంలోనూ ఆయనదే పెత్తనం అవుతుండడంతో మిగితా అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండకుండా నిత్యం ఆయన జలసౌధ చుట్టూ చక్కర్లు కొడుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. ఏ అధికారి బదిలీ కావాలన్నా.. ఎవరికి ప్రమోషన్ కావాలన్నా ఈయనే చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం జరుగుతున్నది. ఈ అధికారి 2007 బ్యాచ్ నియామకాల ద్వారా నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా చేరారు. అంతకుముందు శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించారు. అనంతరం సుమారు 2018లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్నారు.

పదిహేనేళ్లుగా ఒకే విభాగంలో..

ఇదే జలసౌధలో మరో కీలక అధికారి ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్ల అంశంలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వచ్చే అక్టోబరులో రిటైర్డ్ కానున్న ఈ అధికారి.. గత పదిహేనేళ్లుగా ఒకే విభాగంలో పనిచేస్తుండడం గమనార్హం. డిప్యూటీ ఈఎన్సీ హోదాలో ఉన్న ఆయన.. అంత సీనియర్ ఆఫీసర్.. ఒకేచోట ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా.. ఇంతవరకూ ట్రాన్స్‌ ఫర్ చేయకపోవడం జలసౌధలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన గతంలో ఈఈగా పనిచేశారు. దాదాపు పదిహేనేళ్లుగా ఒకే విభాగంలో కీలక హోదాల్లో పనిచేస్తున్న ఆయన అనుభవం, పరిచయాలు, పరిపాలనా పట్టు ఆధారంగా మొత్తం వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారికంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారుల కంటే వీరి మాటకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నదని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అటు తన బాధ్యతలను నిర్వర్తించకుండా.. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్ల అంశంలోనూ తీవ్ర స్థాయిలో జోక్యం చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతున్నది. ఈయనే సీనియార్టీతో సంబంధం లేకుండా తనకు నచ్చిన వారికి జాబితాలో చేర్చి ఉన్నతాధికారి టేబుల్ మీదకు ఫైల్ చేర్చుతున్నారని సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డిప్యూటీ ఈఈ, ఈ డిప్యూటీ ఈఎన్సీ కలిసే ఈ వ్యవహారం నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇరిగేషన్‌లో ఎవరికి బదిలీ కావాలన్నా.. ఎవరికి ప్రమోషన్ కావాలన్నా జాబితా తయారు చేసేది సైతం వీరిద్దరే అన్న టాక్ ఉద్యోగుల మధ్య నడుస్తున్నది.

ఇటీవలి ప్రమోషన్లలోనూ..

ఇటీవల ఈఈ నుంచి ఎస్ఈకి, ఎస్ఈ నుంచి సీఈలకు ప్రమోషన్లు కల్పించారు. వీరితోపాటే ఏఈ నుంచి డీఈలుగానూ కొంత మందికి ప్రమోషన్లు ఇచ్చారు. ఇంకా.. డీఈ నుంచి ఈఈలుగా ప్రమోషన్లు పొందే వారి జాబితా పెండింగులో ఉన్నది. అయితే.. ఇంకో 50 మంది వరకు డిప్యూటీ ఈఈ నుంచి ఈఈలుగా ప్రమోషన్లు తీసుకునే వారు ఉన్నారు. అయితే.. రెండు ఫైల్స్ కూడా ఈఎన్సీ వద్ద, శాఖ సెక్రెటరీ వద్ద పెండింగులో ఉన్నట్లు తెలిసింది. కాగా.. ఈ రెండు జాబితా తయారీలోనూ ఈ ఇద్దరి అధికారుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. వీరు తయారు చేసిన ఫైనల్ జాబితానే ఆ ఇద్దరి అధికారుల టేబుల్స్ మీదకు వెళ్లినట్లు తెలిసింది.

నిత్యం ఈఎన్సీల మార్పు వల్లేనా?

ఇటీవలి కాలంలో జలసౌధలో నిత్యం ఈఎన్సీల మార్పు జరిగింది. ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ అడ్మిన్లను నిత్యం మార్చారు. అయితే.. ఇలా నిత్యం అధికారులను మారుస్తుండడంతో వారికి కింది స్థాయి విభాగాల్లో పనిచేస్తున్న అధికారుల విషయంలో అవగాహన రావడం లేదన్న ప్రచారం ఉన్నది. అందుకే.. ఎవరికి ప్రమోషన్లు ఇవ్వాలి? ఎవరిని బదిలీ చేయాలో అవగాహన లేకుండా పోతున్నదన్న వాదన ఉన్నది. అందుకే.. దీనిని ఆసరాగా చేసుకుంటున్న ఈ ఇద్దరు అధికారులు ఇచ్చిన జాబితాలనే ఫైనల్ చేస్తున్నారన్న టాక్ జలసౌధలో నడుస్తున్నది. వారు ఇచ్చిన జాబితానే ఈఎన్సీలు గుడ్డిగా ఫైనల్ చేస్తున్నారని సమాచారం.

Next Story