- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: పీజీ అర్హత కలిగిన వైద్యుల ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్ట్ విడుదల
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పీజీ అర్హత కలిగిన వైద్యుల సమగ్ర తాత్కాలిక సీనియారిటీ జాబితా (ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్టు) ను ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పీజీ అర్హత కలిగిన వైద్యుల సమగ్ర తాత్కాలిక సీనియారిటీ జాబితా (ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్టు) ను ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం విడుదల చేసింది. ఈ జాబితాను డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రూపొందించినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తాత్కాలిక సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉన్న వైద్యులు తమ అభ్యర్థనలు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలని అధికారులు సూచించారు. ఇందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లో సదుపాయం కల్పించినట్లు వెల్లడించారు. సంబంధిత ఆధార పత్రాలతో కలిసి అభ్యంతరాలను నిర్దిష్ట గడువులోగా సమర్పించాలని తెలిపారు. అభ్యంతరాల్లో వైద్యుల పేరు, స్పెషాలిటీ, అవసరమైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని, పూర్తి వివరాలు లేని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత అందిన అభ్యంతరాలను పరిశీలించబోమని హెచ్చరించారు. రాష్ట్రంలోని వివిధ స్పెషాలిటీలకు చెందిన పీజీ అర్హత కలిగిన వైద్యుల వివరాలను ఈ జాబితాలో చేర్చారు. ఈ జాబితా తాత్కాలికమైనదని... అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది సీనియారిటీ జాబితా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు
అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడాలి...
పీజీ అర్హత కలిగిన వైద్యుల సమగ్ర తాత్కాలిక సీనియారిటీ జాబితాపై పలువురు వైద్యులు పెదవి విరుస్తున్నారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడాలని... హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతే అబ్సార్ప్షన్ ప్రక్రియ చేపట్టాలని పలువురు అభ్యర్థులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో న్యాయపోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ కౌన్సెలింగ్ కంటే ముందే ఇన్-సర్వీస్ డాక్టర్లకు అబ్సార్ప్షన్ కల్పిస్తే... హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా వంటి ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీల్లోని పోస్టులన్నీ వారికే దక్కుతాయని, కొత్తగా నియమితులయ్యే వారికి కేవలం మారుమూల ప్రాంతాల్లోని కాలేజీలే మిగులుతాయని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఇది సమాన అవకాశాల ఉల్లంఘన అని వారు వాదిస్తున్నారు.






