ఖర్చుల పర్వతాల మధ్య.. ఇందిరమ్మ ఇల్లు కలేనా..?

by Bhanu |

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఖర్చుల పర్వతాల మధ్య.. ఇందిరమ్మ ఇల్లు కలేనా..?
X

దిశ, ఆలూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూలీతో పాటు ఇసుక, సిమెంటు, ఇటుకల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రభుత్వ నిర్దేశిత వ్యయంలో ఇంటి నిర్మాణం పూర్తికావడం కష్టమేనన్న అనుమానాలున్నాయి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు రూ.5లక్షలు చెల్లిస్తున్నప్పటికీ లబ్ధిదారులకు ఇంతకు రెట్టింపు స్థాయిలో ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వనులు అన్ని గ్రామాల్లో చురుకుగా కొనసాగుతున్నాయి.


జిల్లాలో 1,6,860 ఇళ్ల మంజూరు మంజూరయ్యాయి. 8,307 ఇల్లుల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. ఒకొక్క గ్రామానికి 20 నుంచి 30 ఇళ్ల మంజూరు కాగా, మేజర్ గ్రామపంచాయతీలో 60 నుంచి80 ఇల్లులు మంజూరు కావడంతో కూలీ కొరత ఏర్పడింది. దీనికి తోడు ఇసుక కొరత ఓవైపు.. పెరిగిన ధరలు మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసే మొత్తానికి, చేసే ఖర్చు రెట్టింపు కానుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఉన్నంత వేగం నిర్మాణంలో కరువైంది. స్థానిక కూలీల కొరతతో ఆంధ్ర మేస్త్రీలే కాకుండా, ఛత్తీస్‌గఢ్‌, బీవార్‌ కూలీలు భారీగా వలన వచ్చారు. మేస్త్రీలు ఒక్కొక్కరు పది, వదిహేను ఇళ్లు ఒవ్పుకోవడంతో కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు అన్ని గ్రామాలలో చురుకుగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 1,6,807ఇండ్లు మంజూరు అయ్యాయి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు సొంత డబ్బులతో బేస్‌మెంట్‌ వరకు నిర్మాణం చేపడితే ప్రభుత్వం వెంటనే లక్ష రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తున్నది.

ఆ తర్వాత గోడలు కట్టినాక మరో 1లక్ష, స్లాబ్‌ పూర్తి చేస్తే రెండు లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత పూర్తి పేమెంట్‌ చేస్తామని ప్రకటించడంతో నిర్మాణ పనుల్లో లబ్ధిదారులు నిమగ్నమయ్యారు. ప్రొసీడింగ్‌ పత్రాలలో చూపించిన నా విధంగా నిర్మాణం లేకుంటే బిల్లులు పడడం లేదని కొందరు చెబుతున్నారు. బిల్లులు పడని వారు సవరించి ప్రొసీడింగ్‌లో చూపించినట్లు నిర్మాణం చేపట్టి యాప్‌ లో అప్లోడ్‌ చేస్తేనే బిల్లులు వస్తాయని అధికారులు సూచించినట్లు తెలిసింది.

ఇసుక వ్యాపారులకు కాసుల వర్షం

వాగులు ఉన్న పరిసర గ్రామాల వ్యాపారులకు ఇందిరమ్మ ఇండ్ల పుణ్యమా అని కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇసుక ఒక్కో టాక్టర్ ట్రిప్పుకు రెండువేల నుంచి రూ.5వేల నుంచి రూ.6వేలు దూరాన్ని బట్టి తీసుకుంటున్నారు. అదే కాలేశ్వరం ఇసుక అయితే రూ. 8వేల నుంచి రూ.10వేలు తీసుకుంటున్నారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని గ్రామాలలో ట్రాక్టర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఇసుక లేనిదే అ నిర్మాణ పనులు మొదలు కాకపోవడంతో వ్యాపారం జోరుగా సాగుతున్నది.

కూలీల కోసం వేట..

ఆలూర్, ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్ మండల కేంద్రంలో ఛత్తీస్‌ గడ్‌,బీహార్‌ నుంచి కూలీల కోసం వచ్చిన మేస్త్రీలతో ఉదయం జాతరను తలపిస్తున్నది. ఒక్కో మేస్త్రి10 నుంచి 20 ఇండ్లను నిర్మాణం చేపడతానని మాట్లాడుకోగా ఒక్కో ఇంటిదగ్గర రోజుకు ఇద్దరు కూలీలను అయినా పెట్టి పనులు చేయించాల్సినీ అవసరం ఉన్నది. దానికోసం కూలీల వేట చేస్తున్నామని కూలీలు దొరకడం లేదని మేస్త్రీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో నుంచి ఎవరైనా కూలీలను తీసుకువచ్చి కొరత తీర్చాలని అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు.

తగ్గించిన రేట్లు... అమలయ్యేనా?

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 7 నుంచి 8లక్షల వ్యయం అవుతుండడంతో కొంతమంది లభ్ధిదారులు నిర్మాణం చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. అందర్నీ నిర్మాణం వైపు మళ్లించేందుకు అధికారులు మేస్త్రీలతో, ట్రేడర్లతో సమావేశాలు నిర్వహించి ధరలు తగ్గించాలని కోరారు. 12 ఎం ఎం స్టీలు రాడ్లకు కిలో 54కు అమ్మాలని, సిమెంట్‌ బస్తా 250 నుంచి 300 మించరాదని, లేబర్‌ రవాణా చార్జీలు ట్రాక్టర్‌ వద్ద కలుపుకొని ఒక్కో ట్రిప్పు ఇసుకకు లోకల్‌ అయితే 1500 నాన్‌ లోకల్‌ అయితే 1700 మాత్రమే తీసుకోవాలని, మేస్త్రీలు చదరపు అడుగు 350 లోపు తీసుకోవాలని, ఇటుక బట్టి వారు ఇటుక 7 నుంచి 8 రూపాయలు ధరకు ఒక్కోటి అమ్మాలని ధర నిర్ణయించారు. నిర్ణయించిన ధరలు అమలు అవుతున్నాయా? లేదా? జిల్లా అధికారులు చెక్‌ చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు.

Next Story