'బాబోయ్ మా వల్ల కాదు'.. చేతులెత్తేస్తున్న తెలంగాణ BJP లీడర్స్!

by Disha Web Desk 2 |
బాబోయ్ మా వల్ల కాదు.. చేతులెత్తేస్తున్న తెలంగాణ BJP లీడర్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: 'బాబోయ్.. మేం ఇంత పని చేయలేం. ఈ స్థాయిలో ప్రోగ్రామ్స్ నిర్వహించలేకపోతున్నాం. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం.' అని పలువురు బీజేపీ లీడర్స్ పార్టీ రాష్ట్ర నాయకత్వం వద్ద వాపోయినట్లు తెలిసింది. పార్టీ యాక్టివిటీస్ పెరగడంతో కొందరు నేతలు కొత్త ఉత్సాహంతో పని చేస్తుండగా, మరికొందరు ఈ ఒత్తిడి తట్టుకోలేమని చేతులెత్తేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇంత పెద్ద మొత్తంలో కార్యకలాపాలు జరగకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.

బీఎస్కే, బన్సల్ నియామకం తర్వాత..

రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం తర్వాత బీజేపీలో సీన్ మొత్తం రివర్స్ అయింది. మునుపెన్నడూ లేనంత విస్తృతంగా పార్టీ యాక్టివిటీ పెరిగింది. ఏకకాలంలో అటు పార్లమెంట్ ప్రవాస్ యోజన, ప్రజా గోస-బీజేపీ భరోసా, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌లో నేతలు తలమునకలై ఉన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి కాషాయ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌ను నిర్వహిస్తున్నది. 15 రోజుల్లోనే 11 వేల వీధి సభలు నిర్వహించాలని దిశానిర్దేశం చేసింది. ఈ బాధ్యతలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునిల్ బన్సల్‌కు అప్పగించింది. దీంతో కట్టుదిట్టంగా అమలుచేయాలని ఆయన ఫిక్సయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లో గ్రౌండ్ లెవల్‌కు వెళ్లి ప్రజల నాడి పట్టుకుని రెండోసారి అధికారంలోకి రావడంలో వీధి సభల పాత్ర కీలకం. అక్కడ బాధ్యతలు చేపట్టింది కూడా బన్సలే. ఈ కారణంతో తెలంగాణ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. తెలంగాణలో ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండటంతో కాషాయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ స్పీడ్ సరిపోదని భావించిన ఆయన ఒక్కసారిగా యాక్టివిటీపై ఫోకస్ పెట్టారు. వరుస కార్యకలాపాలతో నేతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం.

రాష్ట్ర నాయకత్వం దృష్టికి..

తెలంగాణలో కాషాయ పార్టీ క్రమంగా పుంజుకుంటున్నది. కొందరు నేతలకు ఈ స్పీడ్ బాగానే ఉన్నా.. మరికొందరు మాత్రం ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు సమాచారం. అందుకే ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా, ఈ విషయంలో తామేమీ చేయలేమని, హైకమాండ్ ఆదేశాలు తూచ తప్పకుండా పాటించాల్సిందేనని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే తమను తొలగించి ఇతరులకైనా బాధ్యతలు అప్పగించాలని కొందరు మొర పెట్టుకుంటున్నట్లు తెలిసింది.

ఈ ఒత్తిడితో పనిచేయలేమని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉంటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నవారికి వచ్చే ఎన్నికల్లో ప్రయారిటీ ఉంటుందని భావిస్తున్నప్పటికీ.., కొందరు నేతలు తమను తొలగించండని చేసుకున్న విజ్ఞప్తిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో వీక్ గా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో పట్టు సాధించేందుకు కమలదళం అమలు చేస్తున్న వ్యూహాలు ఫలిస్తాయా? నేతలు ఒత్తిడిగా భావించి కార్యకలాపాలు చేపట్టడం మానుకుంటారా? అనేది వేచిచూడాల్సిందే.

Next Story

Most Viewed