మధుమేహం తగ్గుతుందని బీర్లు లాగించేస్తున్నారా?.. అంతకు ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే..

by Dishafeatures2 |
మధుమేహం తగ్గుతుందని బీర్లు లాగించేస్తున్నారా?.. అంతకు ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే..
X

దిశ, ఫీచర్స్ : మనం రోజూ తినే ఆహారం, తీసుకునే మెడిసిన్, వివిధ పానీయాల విషయంలో ఇప్పటికీ పలు అపోహలు నెలకొని ఉన్నాయి. మద్యపానం విషయంలోనూ అదే జరుగుతోంది. బీర్లు, వైన్లతో పాటు పలు రకాల బ్రాండ్లు తాగడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, బలం వస్తుందని, ముఖ్యంగా రక్తంలో చక్కెరస్థాయిలు తగ్గుతాయని, షుగర్ పేషెంట్లు తాగినా ఏమీ కాదని కొందరు నమ్ముతుంటారు. కానీ ఇందులో వాస్తవం లేదని నిపుణులు అంటున్నారు. పైగా మద్యపానం సేవిస్తే పలు సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

* ఆల్కహాల్ లేదా మద్యపానం బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుందనేది నిజం కాదు. ఇదొక అపోహ మాత్రమే. అయినప్పటికీ తాగే అలవాటు, డ్రింక్ చేయడంవల్ల లభించే కిక్కువల్ల పలువురు ఈ అపోహను ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తుంటారు. దీంతో రోజూ డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తారు.

* షుగర్ పేషెంట్లు మద్యం సేవించడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గకపోగా అకస్మాత్తుగా పెరగడమో లేదా వేగంగా పడిపోవడమో జరుగుతుంది. ఈ రెండు సిచ్యువేషన్లు కూడా డయాబెటిస్ పేషెంట్లకు ప్రమాదకరం. పైగా మద్యంలో హై కేలరీలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

*కొందరు తక్కువ మద్యం తాగడంవల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటారు. కానీ నిపుణులు ప్రకారం తక్కువ మోతాదులో తీసుకున్న ఆల్కహాల్ వల్ల కూడా షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అధికంగా తీసుకుంటే ప్రమాదకర స్థాయికి పడిపోతాయి. టైప్-1 డయాబెటిస్ పేషెంట్లు ఆల్కహాల్ సేవించడం మరింత ప్రమాదకరం.

*ఎక్కువ కిక్కిచ్చే హైబ్రాండ్స్ కాకుండా.. బీరు, వైన్ వంటివి బలాన్ని ఇస్తాయని కొందరు చెప్తుంటారు. కానీ వీటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి రక్తంలో షుగర్ లెవల్స్ పెంచుతాయి. పైగా ఆల్కహాల్ ట్రైగ్లిజరైడ్ లెవల్స్‌ను కూడా పెరిగేలా చేస్తుంది కాబట్టి డయాబెటిస్ రోగులు మద్యం సేవిస్తే హైబీపీ పెరగడం, త్వరగా గుండె జబ్బుల బారిన పడటం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి అపోహలు వీడాలని, మద్యానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story