- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హామీలు అమలు చేయమంటే అరెస్టులా..? మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వం తీసుకున్న ప్రీ ప్రైమరీ స్కూల్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అంగన్‌వాడీ టీచర్లు (Anganwadi Teachers) చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వం తీసుకున్న ప్రీ ప్రైమరీ స్కూల్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అంగన్‌వాడీ టీచర్లు (Anganwadi Teachers) చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే వారు సెక్రటేరియట్ (Secretariat) ముట్టడికి వెళ్లగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అంగన్‌వాడీల అరెస్ట్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తమ సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రెటేరియట్‌కు పిలుపునిచ్చిన అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ బీరాలు పలికిన రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో వారిని ఎక్కడిక్కడ అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం సిగ్గుచేటన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా..గుర్తింపు లేదా? ప్రజా పాలన అని రాక్షస పాలన కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సంబురం లేకుండా చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి వారి ఉసురు తగులుతుందని అన్నారు.
అంగన్‌వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ వారు వర్కర్లు కాదని, అంగన్ వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించారని హరీశ్ రావు గుర్తు చేశారు. 2014 నాటికి అంగన్‌వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, సహాయకులకు రూ.2,200 వేతనం లభించేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్ వాడీ టీచర్ల వేతనాన్నిరూ.7,800లకు, అంగన్‌వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800 లకు పెంచి దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లించిన రాష్ట్రంగా తెలంగాణ నిలించిందన్నారు. అభయహస్తం పేరిట కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని 18 వేలకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారని తెలిపారు. మాయమాటలు చెప్పి 22 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీగతీ లేదన్నారు. మహాలక్ష్మి పేరిట మీరు అమలు చేస్తున్న ఉచిత బస్సుల్లోనే జిల్లాల నుంచి సచివాలయం వద్దకు వచ్చి మిమ్మల్ని నిలదీస్తున్నారని అన్నారు. మీ మోసపూరిత వైఖరి పట్ల అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కామెంట్ చేశారు. అరెస్ట్ చేసిన అంగన్‌వాడీలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు.






