ఇంజనీరింగ్ విద్యార్థులపై శరాఘాతం.. భారీగా ఫీజులు పెరిగే చాన్స్!

by Kema Shiva Kumar |

తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజులు పెరిగే అవకాశం కనిపిస్తుంది.

ఇంజనీరింగ్ విద్యార్థులపై శరాఘాతం.. భారీగా ఫీజులు పెరిగే చాన్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. బీటెక్ వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో యాజమాన్యాలు ఈ నిర్ణయానికి వచ్చాయి. ప్రతి ఏటా ఇంజనీరింగ్ కోర్సు చదవాలనుకునే విద్యార్థులు పెరగుతుండడంతో పాటు వారి ఫీజులు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల్లో ఫీజులు 20 శాతం నుంచి 50 శాతం వరకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది. పలు కాలేజీల్లో ఫీజులు ఏకంగా రూ. 2 లక్షలు దాటుతుండగా, వచ్చే మూడేండ్లకుగానూ ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ కసరత్తు ప్రారంభించింది.

గతంలో చివరిసారిగా 2022లో ఫీజులను నిర్ణయించగా ఆ గడువును ఈ విద్యా సంవత్సరంతో ముగుస్తుండడంతో 2025-2026 విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 163 ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో హియరింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. ఆయా కాలేజీలకు సంబంధించి 2022-23, 2023-24 సంవత్సరాల ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టులు, అడ్మిషన్ల వివరాలను సేకరించింది. అదే సమయంలో ఎంత మేర ఫీజు పెంచాలని కోరుతున్నారనే ప్రతిపాదనలనూ స్వీకరించింది. అయితే హియరింగ్ టైంలోనే కొన్ని కాలేజీలకు ఫీజుల పెంపుపై కమిటీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఫీజు రూ.2 లక్షలపైనే..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని కాలేజీల్లో రూ. 2 లక్షల, ఆపైనే ఫీజులు ఖరారు చేసేందుకు మేనేజ్మెంట్లకు టీఏఎఫ్ఆర్సీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంట్లో అత్యధికంగా హైదరాబాద్ లోని రెండు కాలేజీల్లో ఏకంగా రూ. 2.20 లక్షల దాకా ఫీజు పెంచేందుకు అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం కాలేజీలకు ఖరారు చేసిన ఫీజులకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికోసం టీఏఎఫ్ ఆర్సీ కమిటీ సమావేశం కావాల్సి ఉంది. ఒకట్రెండు సార్లు సమావేశమయ్యాకే ఫైనల్ ఫీజులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీఏఎఫ్ ఆర్సీ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతే సర్కారుకు ఫీజుల ప్రతిపాదనలు పంపించనున్నట్లు వెల్లడించారు. మే నెలలో ఈ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.

ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంచడం విద్యార్థుల, వారి తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారుతుందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో సరైన వసతులు లేకున్నా, తగిన ప్రమాణాలు పాటించకున్నా యాజమాన్యాలు టీఏఎఫ్ఆర్సీ కి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాలేజీల్లో విద్యార్థులకు సరిపడా బోధనా సిబ్బంది ఉండడం లేదని, ఉన్నా వారికి తక్కువ జీతాలతో సరిపెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలియజేస్తున్నారు. సిబ్బందికి తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు రిపోర్టులు ఇచ్చి, ఎక్కువ ఫీజుల కోసం ప్రతిపాదనలు పెడుతున్నాయన్నారు. గతేడాది ఫీజులే కొన్ని కాలేజీల్లో ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని, మిగిలిన కాలేజీల్లో పాత ఫీజులే అమలు చేయాలని కోరుతున్నారు.

Next Story