‘ఖానామెట్’‌లో అక్రమార్కుల పాగా..! పట్టించుకోని డిప్యూటీ కలెక్టర్

by Kema Shiva Kumar |

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో కొందరు కబ్జారాయుళ్లు, అక్రమార్కులు పాగావేశారు.

‘ఖానామెట్’‌లో అక్రమార్కుల పాగా..! పట్టించుకోని డిప్యూటీ కలెక్టర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో కొందరు కబ్జారాయుళ్లు, అక్రమార్కులు పాగావేశారు. విలువైన స్థలాలను చెరబట్టి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. వీరికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ అధికారుల సహాయ, సహకారాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖానామెట్ లో అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదు మేరకు శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ ఓ నోటీసు జారీ చేశారు. దానికి తాము జీపీఏ హోల్డర్ నుంచి అసైన్డ్ భూములను కొనుగోలు చేశామంటూ వారు రిప్లయ్ ఇచ్చారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని నిర్ధారణ అయినా.. డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రెండో నోటీసు అంటూ మభ్యపెడుతున్నారు. ఆ కాపీ ఇవ్వమని అడిగితే డిప్యూటీ తహశీల్దార్ దిలీప్ పేరు చెప్తున్నారు. ఆయనేమో ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. దీంతో అవసరం లేకపోయినా రెండో నోటీసు అంటూ తప్పించుకునేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి రెండో నోటీసు అవసరమే లేదు. పీవోటీ, అసైన్డ్ యాక్టుల ప్రకారం చర్యలు తీసుకునే అధికారం రెవెన్యూ అధికారులకు ఉంది. దానికి బదులుగా అంతా గప్ చుప్ అయ్యారు.

ఒక్కరికే నోటీసు..

ఖానామెట్ సర్వే నం.41లో అమర్ నాథ్ రెడ్డికి మాత్రమే నోటీసు జారీ చేశారు. ఆయన బదులిస్తే సైలెంట్ అయ్యారు. అయితే ఆయనతోపాటు పలువురు ఉన్నారు. వారందరికీ నోటీసులు కాదు కదా.. అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అమర్ నాథ్ రెడ్డి ఇచ్చిన రిప్లయ్ లోనే జీపీఏ ద్వారా కొనుగోలు చేశామని, తనతో పాటు మరికొందరు ఉన్నారని స్పష్టమైంది. అయినా అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా.. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డి, డీటీ దిలీప్, ఆర్ఐ చంద్రారెడ్డిలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. అలాగే ఈ అంశం వెలుగులోకి వచ్చినా రాజేంద్రనగర్ ఆర్డీవో కూడా సైలెంట్ అయ్యారు. ఏదైనా చిన్న ల్యాండ్ ఇష్యూ రాగానే రిపోర్ట్ అడిగే అదనపు కలెక్టర్, కలెక్టర్ కూడా ఈ అంశంలో పట్టించుకోకపోవడంతో రియల్ ఎస్టేట్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తున్నది. తెర వెనుక ఎవరో పెద్దలు ఉండి వ్యవహారాన్ని నడిపిస్తుండడం వల్లే ఎకరం రూ.200 కోట్లు పలికే అసైన్డ్ ల్యాండ్స్ ఇష్యూను అందరూ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అసైనీల వారసుల అమాయకత్వమే పెట్టుబడి..

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలో ఖాళీ భూములు దొరకడం గగనంగా మారింది. రూ.177 కోట్లకు ఎకరా స్థలం కొనేందుకు కూడా రియల్ ఎస్టేట్ వర్గాలు వెనకాడడం లేదంటే ఈ ప్రాంతంలో భూములకు డిమాండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఖానామెట్ భూములను వేలం వేయగా ఎకరాకు కోట్ల రూపాయల ధర పలికింది. సరిగ్గా ఇవే భూములను ఆనుకుని ఉన్న స్థలంపై కన్నువేసిన వైసీపీ మాజీమంత్రికి దగ్గరి బంధువైన ఓ రియల్టర్.. ఖానామెట్ లోని సర్వే నంబర్ 41లోని అసైన్డ్ భూములను చేజిక్కించుకునేందుకు పక్కాగా ప్లాన్ చేశాడు. 1961లో అప్పటి ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేసిన భూములను కాజేసే పనిలో పడ్డాడు. అప్పట్లో ఆ భూములను ఎవరికైతే అసైన్డ్ చేసిందో వారి వివరాలను, వారి వారసుల సమాచారాన్ని సేకరించారు. ఎలాగైనా ఆ భూములను హస్తగతం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసి సఫలీకృతం అయ్యారు. నయానో భయానో ముట్టచెప్పి అసైన్డ్ భూములను తమ పేరిట రాయించుకున్నారు.

అన్ని శాఖల వత్తాసు..

ఖానామెట్ గ్రామానికి చెందిన కటికే రామయ్యకు అప్పటి ప్రభుత్వం ఫైల్ నంబర్ ఈ1/11998/1960లో ఐదు ఎకరాల అసైన్డ్ ల్యాండ్ కేటాయించింది. అందులో ఆయన చాలాకాలం సాగుచేసుకుని కుటుంబాన్ని పోషించారని స్థానికులు చెబుతుంటారు. అయితే కటికె రామయ్యకు గండయ్య, సత్తయ్య, బాలయ్య, సైదులు, ఇద్దరు కూతుర్లు. రామయ్య కుమారుల్లో ముగ్గురు మరణించగా వారి వారసులు, కటికె గండయ్య ఇతర చట్టబద్ధమైన వారసులు ఖానామెట్ లోని నరసింహ స్వామి దేవాలయం సమీపంలో నివసిస్తున్నారు. వీరి ఆర్థిక పరిస్థితులను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఓ రియల్టర్ అసైనీ అయిన రామయ్య కుమారుడు గండయ్య, ఇతర వారసులకు డబ్బుల ఆశచూపి అసైన్డ్ భూములను కాజేశాడు. అలాగే వారితో రంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజు నంబర్ వారితో 11908/ 2022, తేదీ 12జులై 2022న 2368 గజాల స్థలాన్ని పవర్ టూ సేల్ ఇమ్మోవబుల్ ప్రాపర్టీ కింద రియల్టర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం. ఇదే సర్వే నంబర్ లోని ఇంకొంత స్థలాన్ని సైతం డాక్యుమెంట్ నంబర్ 11909/2022 ద్వారా పీవోటీ యాక్ట్ 1977 అసైన్డ్ భూముల చట్టాలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అసలు అసైన్డ్ భూమి ఎలా రిజిస్ట్రేషన్ చేశారో అధికారులకే తెలియాలి.

నిబంధనలు వర్తించవా?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు చెల్లుబాటు కావు. అన్నీ తెలిసినా ఆ రియల్టర్ మాత్రం అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం వెనక అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది. ఇలా దక్కించుకున్న భూములను నాలుగు డాక్యుమెంట్ల ద్వారా ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు. సర్వే నంబర్ 41/5లో సుమారు 3,100 గజాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు గాను ఆ కన్ స్ట్రక్షన్ కంపెనీ జీహెచ్ఎంసీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇక్కడే అటు రెవెన్యూ, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అసలు విషయం చెప్పకుండా అనుమతులు తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విషయాన్ని కోర్టుకు తెలుపుతూ నిర్మాణ అనుమతులు పొందారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క శాఖ అధికారులు స్పందించక పోవడం వారి పనితీరుకు అద్దం పడుతున్నది.

Next Story