- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి అక్రమంగా ‘బదలాయింపులు’..! ఇంతకీ ఆ భూములు ఎవరివి?
బీఆర్ఎస్ హయాంలో జీవో 59 ముసుగులో వందల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. నాలుగు నెలల్లోనే రూ.50 వేల కోట్ల విలువైన స్థలాలను కొల్లగొట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ హయాంలో జీవో 59 ముసుగులో వందల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. నాలుగు నెలల్లోనే రూ. 50 వేల కోట్ల విలువైన స్థలాలను కొల్లగొట్టారు. నిబంధనలు, దరఖాస్తుకు జత చేసిన పత్రాలను పరిశీలించకుండానే ఒక్కొక్కరికి వేల గజాల నుంచి ఎకరాల కొద్దీ కట్టబెట్టారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో గజం రూ.3 లక్షల దాకా పలుకుతుంటే.. నామమాత్రంగా రూ.12 వేలు వసూలు చేసి రాత్రికి రాత్రే కన్వేయన్స్ డీడ్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ అర్ధరాత్రి దస్త్రాల బాగోతాన్ని గుర్తించి ఫైళ్లను పెండింగులో పెడుతున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఈ భూములను ఎవరి ఖాతాలో రాస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిషేధిత భూముల జాబితాను రూపొందిస్తున్నది. ఈ క్రమంలో పెండింగులో పెట్టిన, రిజెక్ట్ చేసిన ఫైళ్లలో పేర్కొన్న భూములన్నీ ప్రభుత్వ ఖాతాలో రాయాలి. నిజాయితీగా రెగ్యులరైజ్ చేయించుకున్న ల్యాండ్‌ను పీవోబీ జాబితా నుంచి తొలగించాలి. అయితే, ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్ర అనుమానాలకు దారి తీస్తున్నది. అక్రమ క్రమబద్ధీకరణ ఫైళ్ల తతంగాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే.. మరోసారి క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉంది.
మిగిలిందైనా కాపాడాలి..
సర్వే నంబర్ల వారీగా పక్కాలెక్కలు తీసి మిగిలిన భూమి కాపాడటంలోనూ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. జీవోలు 58, 59, 161 ఆధారంగా రెగ్యులరైజ్ చేసిన ల్యాండ్‌ను పీవోబీ జాబితా నుంచి డిలీట్ చేయాలి. లేకపోతే మొత్తం విస్తీర్ణంలో తేడాలొస్తాయి. ఓ వైపు క్రమబద్ధీకరించిన ల్యాండ్స్‌కు సేల్ డీడ్స్, మ్యుటేషన్స్ అవుతుంటాయి. మరోవైపు అది పీవోబీలోనూ ఉంటుంది. ఈ తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏ సర్వే నంబరులో ఎంత విస్తీర్ణం రెగ్యులరైజ్ చేశారో లెక్కలు తీయాలి. అయితే, సేత్వార్, ఖాస్రా పహానీల ప్రకారమే చేయాలంటూ కలెక్టర్లు ఒత్తిడి చేస్తున్నారని, ఈ రెగ్యులరైజేషన్ ప్రక్రియను గుర్తు చేసినా.. ఇప్పుడా లెక్కలు తీయాలంటే చాలా కష్టం అంటూ దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారని ఓ రెవెన్యూ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో లెక్కలు తీయకుండానే పాత పీవోబీ లిస్టు ప్రకారమే కొత్తది రూపొందిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో ఇల్లీగల్‌గా రెగ్యులరైజ్ చేసిన ల్యాండ్‌ను కూడా ప్రొటెక్ట్ చేయడం కుదరదని అధికారులు అంటున్నారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ సర్వే నం.93లో మొత్తం ల్యాండ్ ఎంత? రెగ్యులరైజ్ చేసింది ఎంత? రిజెక్టెడ్ ఫైళ్ల ప్రకారం విస్తీర్ణం ఎంత? ఈ లెక్కలు తీసి పీవోబీ జాబితాను తయారు చేయాలి. కానీ, సర్వే నం.93లోని మొత్తం విస్తీర్ణాన్ని గతంలో మాదిరిగానే నిషేధిత జాబితాలో ఉంచడం వల్ల లెక్కల్లో హెచ్చుతగ్గులు రావడం ఖాయం. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పీవోబీ జాబితాలోనైనా ప్రభుత్వ భూమి విస్తీర్ణం ఎంతనో పక్కా చేయడం అవసరమని కొందరు రెవెన్యూ అధికారులు గుర్తు చేస్తున్నారు.
వారిపై చర్యలేవి.. స్వాధీనమేది?
బీఆర్ఎస్ హయాంలో భూముల క్రమబద్ధీకరణలో అంతులేని అవినీతి చోటు చేసుకుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తించారు. ఒక్కో కుటుంబానికి మూడు, నాలుగు ప్లాట్లను కట్టబెట్టారు. అయితే, అప్లికేషన్‌తో ఏ డాక్యుమెంట్లు సమర్పించారు? అసలు అవి ఒరిజినలా? డూప్లికేటా? అనేది పరిశీలించకుండానే రాసిచ్చేశారు. కనీసం ఎలాంటి డ్వెల్లింగ్ లేకుండానే ఆ స్థలంలో దరఖాస్తుదారుడు కొన్నేండ్ల నుంచి ఉంటున్నట్లు రిపోర్టు ఇచ్చిన అధికారులు ఇప్పుడు ప్రమోషన్లు పొంది డిప్యూటీ, అదనపు కలెక్టర్లు ప్రమోషన్లు పొందారు. ఉన్నత స్థాయిలో పని చేస్తున్నారు. అలాంటి అధికారులపై ఎలాంటి యాక్షన్ లేకపోయినా.. అక్రమంగా కట్టబెట్టిన ల్యాండ్స్‌ను రక్షించి వేలం వేస్తే రూ.50 వేల కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అంచనా. తొలుత పీవోబీ జాబితా రూపకల్పనలో ఈ జీవో 59 రిజెక్టెడ్ ఫైళ్లలోని విస్తీర్ణాన్ని చేర్చేలా చర్యలు తీసుకోవాలి. అలాగే, రెగ్యులరైజ్ చేసిన విస్తీర్ణం మేరకు డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలర్ట్‌గా ఉండకపోతే అక్రమాల క్రమబద్ధీకరణకు చట్టబద్ధత కల్పించినట్లవుతుందని రెవెన్యూ అధికారుల్లో చర్చ జరుగుతున్నది.
ఇద్దరి దగ్గరే 18 ఎకరాలా..!
మియాపూర్ సర్వే నం.100లో ఏకంగా 33,600 గజాల స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని శాఖమూరి సుగుణ అప్లయ్ చేశారు. అంటే 7 ఎకరాలన్న మాట! శేరిలింగంపల్లి సర్వే నం.106, 107లో ఏకంగా 53,240 గజాల స్థలాన్ని రెగ్యులరైజ్ చేయించుకునేందుకు మేరీ ఏరువ భర్త బోయపాటి ఆరోగ్యారెడ్డి అప్లయ్ చేశారు. అంటే 11 ఎకరాలపై మాటే! వీరి దగ్గరే 18 ఎకరాల యూఎల్సీ స్థలం ఉన్నది. ఈ అప్లికేషన్లు పెండింగులో ఉన్నాయో, ఆమోదించి కన్వెయన్స్ డీడ్స్ ఇచ్చేశారో తెలియదు. కానీ ఇంత ల్యాండ్ కొనడానికి ఎలా సాధ్యమైంది? యూఎల్సీ స్థలమని తెలిసినప్పుడు ఎందుకు కొన్నారు? వీళ్లకు అమ్మిన వ్యక్తికి హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంత పెద్ద మొత్తంలో డబ్బుల చెల్లింపులు ఎలా సాధ్యమైంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలను వెతకాల్సిన అవసరమున్నది. ఇక్కడ ఎకరం కనీసం 50 కోట్ల పైమాటే. అంటే వీరిద్దరి దగ్గరే రూ.900 కోట్ల యూఎల్సీ స్థలం దాగి ఉన్నది.
ఎన్నోన్నో అక్రమాలు..
- నానక్ రాంగూడలో ఒక కుటుంబానికి మూడు, మరో కుటుంబానికి 7 పెద్ద పెద్ద ల్యాండ్ పార్శిళ్లను కట్టబెట్టారు. బి/4039/2023, బి/4040/2023, బి/4041/2023, బి/5039/2023, బి/5040/2023, బి/5041/2023, బి/5042/2023, బి/5043/2023, బి/5044/2023, బి/5045/2023 వంటి ఫైళ్లకు సంబంధించిన కన్వెయన్స్ డీడ్స్ పత్రాలను పరిశీలించాలి. ఒక్కో ప్లాట్ విస్తీర్ణం 490 గజాల నుంచి 950 గజాల వరకు ఉంది. ప్రతి ప్లాట్ విలువ రూ.కోట్లల్లో ఉంటుంది. ఇక్కడ గజం రూ.2 లక్షల పైమాటే.
– ఖాజాగూడ సర్వే నం.66/2, 66/3, 40, నానక్ రాంగూడ సర్వే నం.149, రాయదుర్గ్ సర్వే నం.66/3, 66/2, గోపన్ పల్లిలో సర్వే నం.124, 74.. ఇలా ఒకటా రెండా.. శేరిలింగంపల్లి మండలంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో లెక్క లేనన్ని రెగ్యులరైజేషన్ ఫైళ్లు వచ్చాయి. అందులో చాలా వరకు కన్వీయెన్స్ డీడ్స్ చేశారు. అది కూడా అర్ధరాత్రి చేసినవి కూడా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు అలాంటి అన్నింటినీ పీవోబీలో చేర్చి కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది.
– కొండాపూర్ సర్వే నం.93/పి లో ఎం.దుర్గయ్య అనే వ్యక్తి 8 అప్లికేషన్లు పెట్టారు. ఒక్కో అప్లికేషన్ లో 1500 గజాలు. అంటే 12 వేల గజాలు (రెండున్నర ఎకరాల స్థలం). ఈ అప్లికేషన్లను ఆమోదించారో, తిరస్కరించారో తెలియదు. కానీ, ఆయనే ఇది ప్రభుత్వ స్థలమని అంగీకరించడం ద్వారానే రెగ్యులరైజేషన్‌కు అప్లయ్ చేశారు. ఒక్క వ్యక్తినే ఏకంగా రూ.200 కోట్ల విలువైన స్థలాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రయత్నించారన్న మాటే! అప్లికేషన్ నంబర్లు టీఎస్ యూఎల్ సీఆర్ 021600035414, 021600035432, 021600035425, 021600035434, 021600035436, 021600035441, 021600035443, 021600035448 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూమి కోసం దరఖాస్తు చేశారు.
– కొండాపూర్ సర్వే నం.86/పి, 23, 24, 25, గుట్టల బేగంపేట సర్వే నం.32, 16, 27లో ఎకరాల కొద్దీ విస్తీర్ణం కొల్లగొట్టేందుకు అప్లయ్ చేశారు.






