- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి పై అక్రమ నిర్మాణం.. కోర్టు స్టే నడుస్తుండగానే పనులు..!
భూ అక్రమణదారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాండూరు పట్టణం నడిబొడ్డులో ఉన్న రూ. 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ

దిశ, తాండూరు : భూ అక్రమణదారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాండూరు పట్టణం నడిబొడ్డులో ఉన్న రూ. 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమవుతోంది. సర్వేనంబర్ 111లో గల విజయ విద్యాలయ హైస్కూల్‌కు ఆనుకొని సుమారు 2 వేల గజాల ప్రభుత్వం భూమి ఉంది. గతంలో పాఠశాలకు ఆట స్థలం కోసం ప్రభుత్వం ఆ భూమిని ఇచ్చింది. అయితే ఈ భూమిపై వివాదం నెలకొనడంతో కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు అటు వైపు రాలేకపోతున్నారు. దీంతో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అధికార పార్టీ నాయకుల అండదండలతో కోట్లు విలువ చేసే ఈ భూములు షెడ్ నిర్మిస్తున్నారు. అక్కడ చురుకుగా పనులు సాగుతున్నాయి.
ప్రభుత్వ సూచిక బోర్డు మాయం.
ఈ భూమిలో గతంలో రెవెన్యూ అధికారులు ‘ఇది ప్రభుత్వ భూమి’ అని సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ బోర్డు ఆ స్థలంలో కనిపించడం లేదు. అక్కడ చురుకుగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. సర్కారు భూమి అన్యాక్రాంతమవుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరో మారు కోర్టు ఆశ్రయించిన నిర్వాహకులు
ప్రభుత్వం గతంలో పాఠశాలకు ఆట స్థలం కోసం వాడుకోవాలని ఆ భూమిని ఇచ్చింది. అయితే ఆ భూమి తమదని, తామే హక్కుదారులమని 2015 సంవత్సరంలో విజయ విద్యాలయ హైస్కూల్ యాజమాన్యంలోని కొందరు వ్యక్తులు ముందుకు వచ్చారు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ప్లాట్లుగా చేసి విక్రయించే యత్నం చేశారు. పూర్వవిద్యార్థులు, స్థానికులు కల్పించుకొని కోర్టును ఆశ్రయించడంతో అప్పట్లోనే హైకోర్టు పర్మినెంట్ స్టే ఇచ్చింది. రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ స్థలమని తేల్చేశారు. అయితే ఈ భూమిపై గత కొంతకాలంగా కోర్టులో కేసు కొనసాగుతోంది. కోర్టులో కేసు ఉండగానే జేసీబీ యంత్రాలతో షెడ్ కోసం నిర్మాణాల పనులు చేపట్టడంతో ఈ భూవివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో స్కూల్ కమిటీ నిర్వాహకులు, మాజీ కౌన్సిలర్లు మరో మారు కోర్టు ఆశ్రయించినట్లు సమాచారం.
ప్రభుత్వ తరపున పిటిషన్ వేశాం.
ఈ భూమి కోసం కోర్టులో మళ్లీ పిటిషన్ వేశాం. త్వరలోనే కోర్టు ఆదేశాలు వస్తాయి. కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో తదుపరి చర్యలు మీడియాకు తెలియజేస్తాం
- తారాసింగ్, తాండూరు తహసీల్దార్






