- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా టీవీ కథనం.. ఖండించిన ఐఎఫ్‌ఎస్ అధికారుల సంఘం
మహిళా ఐఏఎస్ అధికారులపై ఓ టీవీ చానెల్‌లో ఇటీవల ప్రసారమైన కథనంపై ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ తీవ్రంగా ఖండించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా ఐఏఎస్ అధికారులపై ఓ టీవీ చానెల్‌లో ఇటీవల ప్రసారమైన కథనంపై ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ తీవ్రంగా ఖండించింది. ఆ ప్రసారం పూర్తిగా అసత్యాలు, ఆధారంలేని ఆరోపణలు, బాధ్యతారహిత వ్యాఖ్యలతో కూడినదిగా పేర్కొంటూ శుక్రవారం హైదరాబాద్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రసారం వాస్తవాలకు విరుద్ధంగా ఉండడమే కాకుండా, మహిళా అధికారుల గౌరవం, గోప్యత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి సంచలనాత్మక కథనాలు ప్రజాసంస్థల విశ్వసనీయతను దెబ్బతీయడంతో పాటు, దేశసేవలో నిబద్ధతతో పని చేస్తున్న అధికారులకు తీరని నష్టం కలిగిస్తాయని ఐఎఫ్ఎస్ అసోసియేషన్ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు.
పోస్టింగులు, వృత్తిపరమైన ప్రవర్తన, వ్యక్తిగత విషయాలపై ప్రసారంలో చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అవి దురుద్దేశపూరితమైనవి, నిరాధారమైనవిగా పేర్కొంటూ, జర్నలిజం పేరుతో ధృవీకరించని ఆరోపణలు ప్రసారం చేయడం బాధ్యతాయుత మీడియా ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆ వివాదాస్పద కంటెంట్‌ను టీవీతో పాటు అన్ని డిజిటల్, సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి దూషణాత్మక చర్యలు పునరావృతం కాకుండా స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా అధికారుల గౌరవం, ప్రతిష్ఠను కాపాడేందుకు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ఏ విధమైన అవమానకర చర్యలకైనా తాము సహించబోమని వర్గీస్ స్పష్టం చేశారు.






