- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మంత్రి చెబితే నో రెస్పాన్.. ఏపీ మంత్రి చెబితే మాత్రం క్షణాల్లో పని పూర్తి!
సాధారణంగా మినిస్టర్లు ఆర్డర్స్ జారీ చేస్తే కలెక్టర్లు తూచా తప్పకుండా పాటిస్తుంటారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సాధారణంగా మినిస్టర్లు ఆర్డర్స్ జారీ చేస్తే కలెక్టర్లు తూచా తప్పకుండా పాటిస్తుంటారు. అందులో జిల్లా మంత్రి చెప్పారంటే మరింత జాగ్రత్తగా పని పూర్తి చేస్తుంటారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ కలెక్టర్ అందుకు భిన్నంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతున్నది. ఓ పని కోసం తెలంగాణ మంత్రులు ఆదేశిస్తే పాటించని ఆ కలెక్టర్ అదే పని కోసం ఏపీకి చెందిన ఓ కీలక మంత్రి ఫోన్ చేస్తే.. వెంటనే పని పూర్తి చేసినట్లు తెలిసింది. ఇక్కడ పని కావాలంటే ఏపీ మంత్రులతో ఫోన్ చేయించాల్సిన దుస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పని చేసిన సినిమా బ్యాక్ గ్రౌండ్
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సినీ పరిశ్రమలో పని చేస్తున్నారు. ఆయనకు గ్రేటర్ వరంగల్ పరిధిలో సుమారు రెండెకరాల భూమి ఉంది. ఆ భూమి 50 ఏండ్లుగా అతని పేరెంట్స్ పేర్లపై ఉంది. కానీ ధరణిలో మాత్రం ఇతర వ్యక్తుల పేర్లలో నమోదయ్యింది. విషయం గ్రహించిన బాధితుడు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయినా కలెక్టర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆయన జిల్లాలోని ఓ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సదరు మంత్రి.. కలెక్టర్‌కు ఫోన్ చేసి వెంటనే పని పూర్తి చేయాలని ఆదేశించారు. పని మాత్రం కాలేదు. విసిగి పోయిన బాధితుడు ఓ రోజు అమరావతికి వెళ్లి తనకున్న సినీ పరిచయాలతో ఏపీ సర్కారులోని కీలక మంత్రిని కలిసి సమస్య చెప్పారు. ఆ మంత్రి కలెక్టర్‌కు ఫోన్ చేసి పని పూర్తి చేయాలని ఆదేశించారు. సదరు కలెక్టర్ వెంటనే బాధితుడి పేరుపై ఉన్న భూమి రికార్డులను సవరించి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసినట్లు స్థానిక కలెక్టరేట్‌లో ప్రచారం జరుగుతోంది.
ఏపీ మూలాలున్న కలెక్టర్
సదరు కలెక్టర్.. ఏపీకి చెందిన కీలక మంత్రి ఆదేశాలు వెంటనే పాటించేందుకు ప్రధాన కారణం సదరు ఆ ఐఏఎస్ మూలాలు ఏపీకి చెందినవనే టాక్ ఉంది. వాస్తవానికి ఆ కీలక మంత్రి అపాయింట్‌మెంట్ కోసం జనాలు ఎగబడుతుంటారు. అలాంటి స్టార్ ఉన్న మంత్రి స్వయంగా తనకు ఫోన్ చేశారని జోష్‌తో కలెక్టర్ పనిని వెంటనే పూర్తి చేసినట్టు అధికార వర్గాల్లో టాక్. సొంత జిల్లాకు చెందిన మంత్రి ఆదేశాలు పాటించేందుకు అడ్డొచ్చిన రూల్స్, ఏపీకి చెందిన మంత్రి ఫోన్ చేయగానే ఎందుకు గుర్తులేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మెజార్టీ దస్త్రాలు బుట్టదాఖలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్‌లో ఉన్న తప్పులను సవరించే అధికారం జిల్లా కలెక్టర్లు కట్టబెట్టింది. కానీ సదరు కలెక్టర్ తన స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలన్నీ పక్కన పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు ఆ కలెక్టరేట్‌కు వచ్చిన మెజార్టీ దరఖాస్తులను ఆయన తిరస్కరించినట్లు విమర్శలున్నాయి. అయితే కలెక్టర్‌కు చెందిన కొందరు సన్నిహితుల ద్వారా వెళ్తే పని పూర్తి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.






