బీజేపీని కాదని వస్తే అవమానిస్తున్నారు.. కాంగ్రెస్‍పై మరోసారి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2026-02-20 09:41:19  IST  )

కాంగ్రెస్ కీలక నేతలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మున్సిపల్ ఫలితాలపై హాట్ కామెంట్స్ చేశారు.

బీజేపీని కాదని వస్తే అవమానిస్తున్నారు.. కాంగ్రెస్‍పై మరోసారి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‍లో (Telangana Congress) మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. తన మంత్రి పదవి విషయంలో సందర్భం వచ్చిన ప్రతిసారి పార్టీని దెబ్బిబొడుస్తున్న ఆయన తన వ్యాఖ్యలతో పార్టీకి కంటిలో నలుసులా మారిందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నిన్న ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి
(Revanth Reddy)
మంత్రుల పర్యటన సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని అధిష్టానం మాట్లాడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర నేతల ఢిల్లీ పర్యటన వేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఏకంగా ఏఐసీసీ
(AICC)
పెద్దలపైనే ఆరోపణలు చేయడం టీకాంగ్రెస్‍లో అసలేం జరుగుతోందనే డిస్కషన్ నడుస్తోంది.

నన్ను అవమానించారు:

తాజాగా ఓ యూట్యూబ్ చానల్‍తో మాట్లాడిన మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. బీజేపీని వీడి కాంగ్రెస్‍లో చేరినప్పుడు నాకు మంత్రి పదవి ఆఫర్ చేశారని ఆ మాటను పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లుగా తనను పార్టీలోకి తీసుకువచ్చిన సునీల్ కనుగోలు, భట్టి విక్రమార్క, మాణిక్ రావు థాక్రే, మహేశ్ కుమార్ గౌడ్‍ వంటి నేతలు తన పట్ల ప్రవర్తించిన తీరు చాలా అవమానకరంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీ వేణుగోపాల్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సీటు సాధిస్తే మీకిచ్చిన హామీని నెరవేరుస్తామని మాట ఇచ్చారని చెప్పారు. తనకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీకి, అధిష్టానానికి ఇబ్బందులు ఉండవచ్చు. కానీ వారు తన పట్ల మాట్లాడిన పద్ధతి, ప్రవర్తించిన తీరు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని కనీసం పిలిచి చెప్పకపోవడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ అనుకుంటున్నట్లు నా సమస్య మంత్రి పదవికోసం కాదన్నారు.

బీజేపీ నన్నెంతో గౌరవించింది:

రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు నచ్చక నేను బీజేపీకి వెళ్తే అక్కడ బీజేపీ నన్ను ఎంతో గౌరవించిందన్నారు. బీజేపీలో (BJP) నన్ను పిలిచి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, స్టేట్‍లో స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. అంత గౌరవించాక కూడా కాంగ్రెస్ పార్టీ కన్నతల్లిలాంటిదని అందులోకి తిరిగి ఆహ్వానిస్తున్నారు కదా అని వచ్చానన్నారు. గౌరవం కాపాడుతారని నమ్మి వచ్చాను. మంత్రి పదవి ఇవ్వకపోయిన పర్వాలేదు కానీ నన్ను అవమానించిన తీరు బాగోలేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయం మరోలా ఉండేదని ఇటీవల సీపీఐ ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం కూడా చెప్పారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నా విషయంలో తప్పు చేసినప్పటికీ ఢిల్లీకి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానన్నారు.

స్థానిక ఫలితాలు అధికార పార్టీకే అనుకూలం:

రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ పనితీరుపై అధిష్టానం ప్రశంసించడంపట్ల స్పందించిన రాజగోపాల్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎన్నికలు అన్నీ వారే గెలిచారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కాంగ్రెస్ గెలిచినట్లు మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎప్పుడు అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయన్నారు. కానీ నిజంగా ప్రజల్లో ఏం ఉంది? మనం ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చాం అన్నది ముఖ్యం అన్నారు. బీఆర్ఎస్‍పై చేసిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నాం? మన పాలన అవినీతి లేకుండా కొనసాగుతోందా? ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చాం? మంత్రివర్గ విస్తరణ పూర్తయిందా? కీలక పదవుల్లో ఎవరున్నారు? అనేది ముఖ్యం అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రైనా రెండేళ్ల పాటు ఇన్ని శాఖలు తన వద్దే పెట్టుకున్నారా ఇవన్నీ ప్రజలకు సమాధానాలు చెప్పాల్సిన అంశాలన్నారు.

Next Story