నేను వాళ్ల, వీళ్ల బాణం కాదు.. తెలంగాణ ప్రజల బాణం : కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్

by Ramesh Naini |

నేను వాళ్ల బాణం, వీళ్ల బాణం కాదు.. తెలంగాణ ప్రజల బాణం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు.

నేను వాళ్ల, వీళ్ల బాణం కాదు.. తెలంగాణ ప్రజల బాణం : కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేను వాళ్ల బాణం, వీళ్ల బాణం కాదు.. తెలంగాణ ప్రజల బాణం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) హాట్ కామెంట్స్ చేశారు. శనివారం కరీంనగర్‌లో జాగృతి జనంబాట కార్యక్రమంలో కవిత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొన్నదని ఆమె పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడాల్సిన ప్రధాన పార్టీలు ఆ బాధ్యత నిర్వర్తించడం లేదని విమర్శించారు. ప్రజలు కొన్ని పార్టీలను నమ్మి దగాపడ్డారని ఆమె వ్యాఖ్యానించారు. మా ప్రాధాన్యం ప్రజల సమస్యలు తీర్చటమే.. జాగృతి ప్రజల గొంతుకగా మారుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నప్పుడు, రైతులు తుఫానుతో నష్టపోయినా పట్టించుకోవడంలేదని కవిత విమర్శించారు. వరంగల్ నగరమంతా నీటిలో మునిగినా ఎవరూ పోరాడటం లేదని.. మేమే ప్రజల తరఫున పోరాడతాం అని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాకు ఎలాంటి స్టాండ్ లేదని కవిత స్పష్టం చేశారు.

కార్మికుల హక్కులు, ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యా వ్యవస్థ, మహిళా ప్రాతినిధ్యం వంటి అంశాలపై కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కార్మికుల హక్కులను కాలరాస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోరాటం చేయలేదని ఆరోపించారు. ప్రధాన స్రవంతి పార్టీలు పట్టించుకోలేదు.. లెఫ్ట్ పార్టీలు ప్రయత్నించినా వారి శక్తి సరిపోలేదన్నారు. 52% ఉన్న బీసీలకు సరైన రిజర్వేషన్లు రావాలని, మహిళలకు తగిన ప్రాతినిధ్యం దక్కాలని అన్నారు.

తన రాజీనామా విషయమై కూడా స్పందించిన కవిత, లోకల్ బాడీ ఎన్నికల సమయంలోనే ఏం చేయాలన్నది నిర్ణయం తీసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. నా రాజీనామా యాక్సెప్ట్ చేయమని కోరాను.. కానీ దీనిని ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో వారికే అర్థం కావడం లేదన్నారు. నా రాజీనామా యాక్సెప్ట్ చేస్తే ఆరు నెలల లోపు ఎమ్మెల్సీని చేయాలి అనేది వారి ఆలోచన కావొచ్చు అని అభిప్రాయ పడ్డారు. చైర్మన్ నా రాజీనామా పై నాతో కాకుండా చిట్ చాట్ లో మాట్లాడుతున్నారని అన్నారు. మరొక సారి ఆయనతో మాట్లాడి రాజీనామా యాక్సెప్ట్ చేయమని కోరుతానని క్లారిటీ ఇచ్చారు. జాగృతి ప్రజా బాట పూర్తైన తర్వాత తమ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని వ్యాఖ్యానించారు. సామాజిక తెలంగాణ సాధనలో వెనకడుగు వేయబోమని, సమసమాజం రావాల్సిన అవసరముందని కవిత అన్నారు. ప్రజల హక్కుల కోసం పిడికిలి బిగించి ఉద్యమం చేయాలి.. విప్లవాత్మక మార్పు సమయం వచ్చిందని ఆమె పిలుపునిచ్చారు.

Next Story