- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ranganath: చెరువుల పక్కన ప్రభుత్వ భూములుంటే స్వాధీనమే
చెరువుల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల గురించి పూర్తి స్థాయిలో విచారించి.. వాటిని స్వాధీనం చేసుకుని చెరువు అభివృద్ధిలో భాగం చేయాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువుల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల గురించి పూర్తి స్థాయిలో విచారించి.. వాటిని స్వాధీనం చేసుకుని చెరువు అభివృద్ధిలో భాగం చేయాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఆదేశించారు. ఆక్రమణదారుల పత్రాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సున్నం చెరువు చెంత సర్వే నంబరు 30, 31కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని.. ప్రభుత్వ భూమి ఉంటే అంగుళం కూడా పోకుండా సెక్యూర్ చేయాలన్నారు. ఈ రెండు సర్వే నంబర్ల మధ్య ఉన్న ప్రభుత్వ భూమికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా.. క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తమ్మిడికుంట చెరువుకు పై భాగంలో కింది భాగంలో ఉన్న ప్రభుత్వ భూములను తమదిగా క్లైమ్ చేస్తున్న వారి పత్రాలను పరిశీలించాలని సూచించారు. తమ్మిడికుంట చెరువును ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతుంటే.. పై భాగంలో వేస్తున్న చెత్త, వ్యర్థాల వల్ల మళ్లీ నీరు కలుషితమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.
మాదాపూర్‌లోని తమ్మిడికుంటతో పాటు సున్నం చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం పరిశీలించారు. చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. రెండు నెలల్లో చెరువుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా తమ్మిడికుంటను పరిశీలించిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం సందర్శించారు. ఐటీ కేంద్రానికి చెరువుగా ఉన్న తమ్మిడికుంటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కాకుండా.. ఇక్కడకు వస్తే ఒత్తిడి కూడా దూరమమయ్యేలా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయాన్ని చెరువు అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్న అధికారులకు కమిషనర్ చెప్పారు. చెరువు చుట్టూ పచ్చదనం నిండుగా కనిపించాలని సూచించారు. బయట కంటే చెరువు చెంత 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువ ఉండేలా పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. చెరువు చుట్టూ పాత్ వేలు, కూర్చొని సేద దీరేందుకు వీలుగా సీటింగ్ వ్యవస్థ, పార్కులు, పచ్చిక బైళ్లు.. ఉండేలా చూడాలన్నారు.
వరద కాలువ సమస్యను పరిష్కరిస్తాం..
సున్నం చెరువు చెంతన ఉన్న బోరబండ బస్తీ, ఎన్ఆర్ఆర్ పురం నుంచి వచ్చే వరద నీరు నేరుగా చెరువులోకి కలిసేలా ఇన్‌లెట్లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. వరద నీరు చెరువులోకి చేరేలా.. మురుగు నీరు కిందకు పోయేలా డైవర్ట్ కాలువ నిర్మాణం కూడా పూర్తయ్యిందని.. త్వరలో అనుసంధానం చేయాల్సి ఉందని అధికారులు ఈ సందర్భంగా కమిషనర్‌కు వివరించారు. అయితే ఈ అనుసంధానం జరగకపోవడంతో సున్నం చెరువు రోడ్డు నుంచి బస్తీలోకి వెళ్లే మార్గం ప్రమాదకరంగా మారిందని.. ఇక్కడ పైపులైన్లు వేసి మురుగు సాఫీగా సాగేలా చూడాలని స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా.. రెండు రోజుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి వచ్చి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. సున్నం చెరువును ఆనుకుని వెళ్తున్న హైటెన్షన్ వైర్ల కింద ఆక్రమణలను తొలగించి.. రహదారి విస్తరణపై చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.






