మరో రూ. 750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

by Malleboina Mahesh |

ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కుల రక్షణనే లక్ష్యంగా స్థాపించిన హైడ్రా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది.

మరో రూ. 750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కుల రక్షణనే లక్ష్యంగా స్థాపించిన హైడ్రా (Hydraa) అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టకుండా.. హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే నగరంలో వందల ఎకరాలను అక్రమార్కుల చెర నుంచి విడిపించగా.. తాజాగా రూ. 750 కోట్ల విలువల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. షేక్పేట మండలం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి పై ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ, భవిష్యత్తులో ప్రభుత్వ ఉపయోగానికి భూమిని రక్షించడానికి చర్యలు తీసుకుంది. ఈ భూమిలో ఇప్పటికే 1.20 ఎకరాలను జలమండలి కోసం కేటాయించారు.

కానీ పార్థసారథి అనే వ్యక్తి మొత్తం 5 ఎకరాలను తన ఆధీనంలోకి తీసుకుని ఫెన్సింగ్ వేసి, బౌన్సర్లు, వేటకుక్కలతో భూభాగాన్ని ఆక్రమించాడు. అతను షెడ్డులు నిర్మించి, ప్రభుత్వ భూమిలో అడ్డా వేసి మద్యం సేవించి, జలమండలి నడిపే వాటర్ రిజర్వాయర్ పనులను అడ్డుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఫేక్ సర్వే నంబర్ (403/52) ద్వారా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసిన పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రెవెన్యూ, జలమండలి 4 క్రిమినల్ కేసులు నమోదు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు, భారీ బందోబస్తు, జేసీబీలతో సదరు భూమిని హైడ్రా ఆధీనంలోకి తీసుకుని, ఆక్రమిత ఫెన్సింగ్, షెడ్డులను తొలగించి, 5 ఎకరాల చుట్టూ ప్రభుత్వ భూమిగా గుర్తు చేస్తూ బోర్డులను హైడ్రా ఏర్పాటు చేసింది.

Next Story