- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలా నిర్వహణలో హైడ్రా-జీహెచ్ఎంసీ సహకారం.. వరద సమస్యలపై ఫోకస్
హైడ్రా, జీహెచ్‌ఎంసీ పరస్పర సహకారంతో పని చేస్తే వర్షాకాలం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడగలమని హైడ్రా - జీహెచ్‌ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, ఆర్వీ కర్ణన్ అభిప్రాయపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : హైడ్రా, జీహెచ్‌ఎంసీ పరస్పర సహకారంతో పని చేస్తే వర్షాకాలం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడగలమని హైడ్రా - జీహెచ్‌ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, ఆర్వీ కర్ణన్ అభిప్రాయపడ్డారు. సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలు.. వాటి పరిష్కారంలో ఇబ్బందులపై ఇరువురు కమిషనర్లు గురువారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో చర్చించారు. ఇరుశాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాలా నెట్‌వర్క్‌పైనా క్షుణ్ణమైన అవగాహన ఉన్న జీహెచ్ఎంసీ ఏఈలు, డీఈలు.. ఫీల్డ్‌మీద పనిచేస్తున్న హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్(ఎంఈటీ)లు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు(డీఆర్ఎఫ్) బృందాలకు సహకారం అందించాలని ఇరువురు కమిషనర్లు సూచించారు. హైడ్రా- జీహెచ్ఎంసీ వేర్వేరు కాదని.. రెండు విభాగాల లక్ష్యం ప్రజలకు ఇబ్బంది లేని మెరుగైన జీవనాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఇరు శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షం పడినప్పుడు రహదారులను, నివాస ప్రాంతాలను వరద ముంచెత్తకుండా.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇరు శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. జలమండలి సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వెల్లడించారు.
పనుల పర్యవేక్షణలో పరస్పర సహకారం..
ఆర్‌యూబీల వద్ద డీ వాటరింగ్ పంపుల నిర్వహణ, క్యాచ్‌పిట్స్ క్లీనింగ్, క్యాచ్‌పిట్స్ మధ్యన ఉన్న పైపుల్లో సిల్ట్ తొలగించడం, నాలా భద్రత, నాలాల క్లీనింగ్, సిల్ట్‌ను తరలించడం, మాన్సూన్ సమయంలో డీసిల్టింగ్ చేయడం, వర్షంలో కొట్టుకొచ్చిన చెత్తను తరలించడం, నాలాల్లో తీసిన సిల్ట్‌ను ఎక్కడకు తరలించాలి.. వార్డు కార్యాలయంలో ఎంఈటీలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. జీహెచ్ఎంసీ జేసీ, డీసీ స్థాయి నుంచి డీఈలు, ఏఈలు ఇలా అన్ని స్థాయిల్లోనూ పూర్తి సహకారం హైడ్రాకు అందజేయాలని ఇరువురు కమిషనర్లు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఇరు శాఖలపై ఉందని అభిప్రాయ పడ్డారు. రోడ్డు అండర్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌ల వద్ద నీరు నిలవకుండా చూడాలని నిర్ణయించారు.
జీవన ప్రమాణాలు పెంచాలి..
ఐటీ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచడానికి అందరూ కృషి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ సూచించారు. వర్షాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ అస్తవ్యస్తం అయితే హైదరాబాద్ ఇమేజీ దెబ్బతింటుందని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొత్తగూడ బ్రిడ్జిపై, అండర్ పాస్‌లో నీరు నిలవడాన్ని ఉదహరించి.. ఈ సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత ఇరు విభాగాలపై ఉందన్నారు. నగర జీవన ప్రమాణాలు పెంచేందుకు మనందరం కృషి చేయాలని.. ఇందుకు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఇలాంటి సమావేశాలు తరచూ జరిగితే సమన్వయం మరింత పెరుగుతుందన్నారు.
హైడ్రాకు పూర్తి సహకారం : జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్
వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హైడ్రాకు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం సంపూర్ణ సహకారం అందిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓపెన్ నాలా డీ సిల్టింగ్, నిర్వహణ, కొత్తగా నిర్మించిన సంపుల నిర్వహణ జీహెచ్ఎంసీ చూసుకుంటుందని, లేక్‌లలో నీటి నిల్వస్థాయి సమాచారాన్ని హైడ్రాతో పంచుకుంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తామని అన్నారు.
ఆ బాధ్యత మాకివ్వండి : హైడ్రా కమిషనర్ రంగనాథ్
నగరంలోని 11 అండర్ పాస్‌ల నిర్వహణ బాధ్యత హైడ్రా తీసుకుంటుందని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఫ్లై ఓవర్లపై వర్షపు నీరు నిలువకుండా చూసేందుకు వర్షపు నీరు వెళ్లే మార్గాలను క్లీనింగ్ బాధ్యత తాము చేస్తామన్నారు. క్యాచ్ పిట్‌లలో డీ సిల్టింగ్ బాధ్యతలను, నాలా సేఫ్టీ ఆడిట్ బాధ్యతలు తాము చూస్తామని అన్నారు. క్యాచ్ పిట్‌లలో డీ సిల్టింగ్ చేయగా వచ్చే మట్టిని తరలించేందుకు వీలుగా వార్డుల వారీగా పాయింట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సహకరించాలని రంగనాథ్ సూచించారు. సమావేశంలో జోనల్ కమిషనర్‌లు అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, హేమంత్ సహదేవరావు, రవికిరణ్, వెంకన్న, చీఫ్ ఇంజినీర్ రత్నాకర్, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజినీర్ భాస్కర్ రెడ్డి, లేక్స్ చీఫ్ ఇంజినీర్ కోటేశ్వర రావు, డీఎఫ్ఓ పాపయ్య తదితరులు పాల్గొన్నారు.






