బస్తీల్లో నీటి కష్టాలు..ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్

by velandi.Saikiran |   (  Updated:2026-05-13 21:30:36  IST  )

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. తాగునీటికి ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది.

బస్తీల్లో నీటి కష్టాలు..ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్
X

బస్తీల్లో నీటి కష్టాలు

- ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్

- బుకింగ్ చేస్తే 3 మూడు రోజుల వరకు నిరీక్షణ

- డిమాండ్ మేరకు నీటి సరఫరా

-నారాయణగూడ జలమండలి జీఎం శ్రీధర్

దిశ, హిమాయత్ నగర్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. తాగునీటికి ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. హైదరాబాద్‌లో నీటి కష్టాలు వేసవిలో తీవ్రరూపం దాల్చుతున్నాయి. భూగర్భ జలాలు పడిపోవడం, బోర్లు ఎండిపోవడంతో నగరవాసులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హిమాయత్ నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కాలకృత్యాలు తీర్చుకునేందుకు జలమండలి నుంచి వచ్చే నీరు సరిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ్ బస్తీ, గాంధీ నగర్, గాంధీ కుటీర్ తదితర బస్తీల్లో వాటర్ ట్యాంకర్స్ మీద కాలం వెళ్లదీస్తున్నారు.

ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్..

మంచినీటి ట్యాంకర్ల కోసం 72 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. జలమండలి ట్యాంకర్ల కోసం బుకింగ్‌లు బాగా పెరిగాయి. ఎన్జీవో సంస్థలు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ ద్వారా నీటిని సరఫరా చేస్తూ స్థానికులకు దాహాన్ని తీరుస్తున్నారు.

భారీ తగ్గిన భూగర్భ జలాలు..

కొన్ని చోట్ల నెల రోజుల్లోనే 2 మీటర్ల వరకు నీటి మట్టం తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. ఎండాకాలం కావడంతో నీటి వాడకం పెరగడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

డిమాండ్ మేరకు నీటి సరఫరా..

ప్రజల డిమాండ్ మేరకు నీటిని సరఫరా చేస్తున్నాం. రోజూ 100 పైగా వాటర్ ట్యాంకర్స్ బుకింగ్స్ అవుతున్నాయి. ఒక రోజులోనే సరఫరా చేస్తున్నాం. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.

- నారాయణగూడ జలమండలి జీఎం శ్రీధర్

Next Story