2 నుంచి వార్డు పాలన.. తొలుత మేయర్ డివిజన్‌లో ప్రారంభం

by Disha Web Desk 12 |
2 నుంచి వార్డు పాలన.. తొలుత మేయర్ డివిజన్‌లో ప్రారంభం
X

దిశ, సిటీబ్యూరో : ప్రత్యేక రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సర్కారు నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రేటర్ సిటీ లో వార్డు పాలనను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెల 2 నుంచి వార్డు పాలనను అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి యాభై వేల మందికి ఓ వార్డు ఆఫీసును ఏర్పాటు చేసి స్థానిక అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారానికి ఈ వ్యవస్థను తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే 150 వార్డులకు గాను 150 మంది వార్డు ఆఫీసర్లు నియమితులైన సంగతి తెలిసిందే.

మొట్టమొదటి వార్డు ఆఫీసును మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న బంజారాహిల్స్ డివిజన్‌లోనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వార్డు ఆఫీస్ ఏర్పాటు పనులను మేయర్ పరిశీలించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వార్డు ఆఫీసును మంత్రి కేటీఆర్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం జీహఎచ్ఎంసీలోని కామాటి నుంచి కమిషనర్ వరకున్న సిబ్బంది మొత్తం కూడా వార్డు ఆఫీసుల ఏర్పాటు, సిబ్బంది నియామకాలు, శిక్షణ తరగతుల నిర్వహణలోనే నిమగ్నమై ఉన్నారు.

ఎవరెవరుంటారు?

మహానగరంలో ప్రస్తుతమున్న 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు ఒక్కో ఆఫీసును ఏర్పాటు చేసి, ఆ ఆఫీసుకు వార్డు శానిటేషన్ ఆఫీసర్‌ను నియమించటంతో పాటు వారికి కిందిస్థాయి సిబ్బంది అయిన టెక్నికల్, నాన్ టెక్నికల్ స్టాఫ్‌గా మరో ఆరుగురిని నియమించే ప్రక్రియ కొనసాగుతుంది. అంతేగాక ఈ వార్డు ఆఫీసులో స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు ప్రత్యేక ఛాంబర్లను ఏర్పాటు చేయనున్నారు.

తొలి దశగా ఈ వార్డు ఆఫీసుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, మూడు గంటల తర్వాత ఈ ఫిర్యాదులను కంప్యూటర్‌లో సేవ్ చేసుకుని, ఆ తర్వాత సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వార్డు ఆఫీసర్లపైనే ఉంటుందని ఇటీవలే నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఉన్నతాధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి, తిరిగి వారికి సమాధానమిచ్చేలా జవాబుదారి తనంతో వార్డు ఆఫీసర్లు వ్యవహరించాలని ఇప్పటికే సూచించారు. ఇదే ఆఫీసులో వార్డు కమిటీల సమావేశాలను కార్పొరేటర్ల అధ్యక్షతన కొనసాగేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed