ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలి: డిప్యూటీ కమిషనర్

by Kodari Anjali |

డిప్యూటీ కమిషనర్ ఎం.ఎన్.ఆర్. జ్యోతి ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలి: డిప్యూటీ కమిషనర్
X

దిశ, సికింద్రాబాద్: ప్రత్యేక సత్వర ఓటరు జాబితా సవరణ-2026 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఎన్నికల నమోదు అధికారి, మెట్టుగూడ సర్కిల్ నెం.44 డిప్యూటీ కమిషనర్ ఎం.ఎన్.ఆర్. జ్యోతి ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జూన్ 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించనున్న ఇంటింటి సర్వేను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం, సేకరించడం, ఓటర్ల వివరాలను ధృవీకరించడం, అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరు జాబితాలో నమోదు చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. సర్వేను వంద శాతం పూర్తి చేయాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేయాలని, మరణించిన, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన లేదా డూప్లికేట్‌గా నమోదైన ఓటర్ల వివరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఓటర్ల వివరాల్లో ఉన్న పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్‌ను కచ్చితంగా పాటిస్తూ నిర్ణీత గడువులో అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలని జ్యోతి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తార్నాక సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధీర్ సింగ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సాయిబాబా, తహసీల్దార్లు అసదుల్లా ఖాన్, పండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story