జీరో దందకు కేరాఫ్ సికింద్రాబాద్..!

by Ajay Maddhiboyina |

నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం.. ఉదయం నుంచి మొదలు రాత్రి వరకు ఆయా షాపులు జనాలతో కిక్కిరిసిపోతాయి. ఎవడి దందా వాడిదే అన్న చందంగా వ్యాపారాలు జోరుగా సాగుతాయి.

జీరో దందకు కేరాఫ్ సికింద్రాబాద్..!
X

దిశ, బేగంపేట: నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం.. ఉదయం నుంచి మొదలు రాత్రి వరకు ఆయా షాపులు జనాలతో కిక్కిరిసిపోతాయి. ఎవడి దందా వాడిదే అన్న చందంగా వ్యాపారాలు జోరుగా సాగుతాయి. సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత ఈ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన కస్టమర్లకు బిల్లులు ఇవ్వకుండా నకిలీ బిల్లులు ఇస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండికొడుతున్న వైనం నిత్యం ఈ ప్రాంతంలో జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కస్టమర్లు కూడా ఎలాంటి బిల్లు ఇవ్వకపోయినప్పటికీ తక్కువ రేట్లకు షాపుల యజమానులు ఇస్తున్నారు కదా? అని కొనుగోలుదారులు సైతం మిన్నకుండిపోతున్నారు. అయితే ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని గండికొడుతూ లక్షలాది రూపాయలు జీఎస్టీ రూపంలో చెల్లించాల్సిన షాపుల నిర్వాహకులు అప్పనంగా దోచుకుంటున్నారు. కోట్ల రూపాయల వ్యాపారం చేసేవారు కేవలం వేలల్లో వ్యాపారం చేస్తున్నట్లు దొంగ లెక్కలు చూపిస్తూ అప్పనంగా సొమ్ము చేసుకుంటున్న వైనం అనేకం వెలుగులోకి వస్తున్నా అక్రమంగా వ్యాపారం సాగిస్తున్న వ్యాపారులపై కొరడా ఝుళిపించాల్సిన ఇన్‌కం ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ అధికారులు మామూళ్ల మత్తులో కొనసాగుతున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అటు ప్రభుత్వాన్ని.. ఇటు ప్రజలను మోసం చేస్తూ జీరో దందా చేసేవారు ఎక్కువయ్యారు. వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిన సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో మరింత ఎక్కువైందనే దానికి ఇక్కడ జరుగుతున్న వ్యాపార లావాదేవీలే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరీముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 3 గంటల్లోపు వాహనాల్లో నగరానికి వస్తున్న సరుకును అక్రమంగా గోదాముల్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు. పన్నులు చెల్లించకుండా నగరానికి చేరుతున్న వాహనాలను గుర్తించడం లేదన్న ఫిర్యాదులు వ్యక్తం అవుతున్నాయి. అయినప్పటికీ వాణిజ్య పన్నుల శాఖ అటువైపు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారులు దినదినాభివృద్ధి చెందుతున్నారు. దీంతో విక్రయించే సరుకుకు సరైన బిల్లులు లేకపోవడంతో అసలా? నకిలీవా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.

జీరో దందకు కేరాఫ్ సికింద్రాబాద్..

హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలుగా పేరుగాంచినప్పటికీ.. ఇక్కడ ఏ వ్యాపారానికి కొదవ లేదు. లేని వ్యాపారం అంటూ లేదు. బంగారం, వెండితోపాటు ఇత్తడి, స్టీల్, ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్, వాహనాలకు సంబంధించిన సామాగ్రి చెప్పుకుంటూపోతే లెక్కేలేదు. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ ఉండదు. అదేస్థాయిలో జీరో దందా కొనసాగుతుందని జగమెరిగిన సత్యం. ముఖ్యంగా చెప్పుకోదగ్గది సికింద్రాబాద్ రాణిగంజ్, జనరల్ బజార్, టోబాకోబజార్, పార్క్ లైన్ సెంటర్, మోండా మార్కెట్ లాంటి వ్యాపారసముదాయలున్నాయి. ఏ దుకాణంలోకి వెళ్లినా కోట్ల రూపాయల దందా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ వ్యాపార సిండికేట్ చక్రం తిప్పి భారీమొత్తంలో వసూళ్లు చేసి ప్రతినెలా మామూళ్ల రూపంలో సంబంధిత అధికారులకు ముట్టజెప్పుతున్నట్లు ఈ ప్రాంతంలో జోరుగా ప్రచారం సాగుతున్నది. దీంతో వారు అక్రమ వ్యాపారుల దందాను అడ్డుకోవాల్సిన ఆయా శాఖలు అటువైపు కన్నెత్తి చూడడం లేదని బాహాటంగానే చర్చ జరుగుతున్నది.

స్టీల్ జీరో వ్యాపారం:

నిర్మాణానికి ఉపయోగించే స్టీలు విక్రయాల్లో భారీగా జీరో వ్యాపారం సాగిస్తున్నారు.... సికింద్రాబాద్ లో పెద్ద స్టీల్ వ్యా పారులు భారీమొత్తంలో వ్యాపార దందా సాగిస్తూ... కొనుగోలు దారులకు తెల్లకాగితం పై బిల్లు ఇస్తున్నారే తప్ప.. జీఎస్టి బిల్లు స్టీల్ కొనుగోలు చేసిన ఏ కస్టమర్ ఇచ్చిన దాఖలాలేవు... వందమందికి వివిధ కంపెనీ స్టీలు అమ్మినప్పటికీ

పదిమందిలో ఇద్దరికీ మాత్రమే జిఎస్టి బిల్లు ఇచ్చి దీని మాత్రమే లెక్కలు చూపించేందుకు జీఎస్టి బిల్లులు ఇస్తున్నట్లు స్టీలు కొనుగోలు దారులు పేర్కొనడం గమనార్హం.. దీంతో కోట్ల రూపాయల పన్ను ఎగవేత జరుగుతోందని పదవీ విరమణ పొందిన ఓ వాణిజ్య పన్నుల శాఖ అధికారి దిశ పేపర్ కు తెలపడం విశేషం.. దీనంతటికి కారణం ఆయా శాఖల అధికారుల మ్యామ్యాలు, నిఘాలోపమే కారణమన్నారు.

ఎలక్ట్రికల్‌కు కేరాఫ్ రాణిగంజ్, హైదరబస్తీ, కింగ్స్ వే..

ఎలక్ట్రికల్, హార్డ్ వేర్, బూల్స్కు కేరాఫ్ రాణిగంజ్, హైదరబస్తీ, కింగ్స్ వేలు కేరాఫ్‌గా మారిపోయింది. నిత్యం కోట్ల రూపాయల దందా కొనసాగుతున్నది. రాత్రి వేళలో డీసీఎం ద్వారా లోడ్లు వస్తుంటాయి.. ఇక్కడ జరుగుతున్న వ్యాపారంపై స్థానికుల్లో అనేక ఆరోపణలున్నాయి. ఎలక్ట్రికల్స్ విషయానికి వస్తే.. గోల్డ్ మెడల్, ఫినాలెక్స్, యాంకర్, పోలి క్యాబ్ వంటి అగ్ర కంపెనీలను సైతం సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీతో నకిలీ కంపెనీల పేరుతో అదే బ్రాండ్ అంటూ లోకల్ తయారు చేసి మార్కెట్లలో విచ్చలవిడిగా విక్రయాలు జరిపి షాపుల యాజమాన్యలు సొమ్ము చేసుకుంటున్నాయి.

సికింద్రాబాద్ సీటీసీలో అక్రమాల పుట్ట..

సికింద్రాబాద్ పార్క్ లైన్ సెంటర్‌లో సీటీసీ అక్రమాల పుట్టగా మారింది. నగరంలోనే పేరుగాంచిన సీటీసీలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్ విడిభాగాలకు విక్రయాల నిలయంగా మారిందని చెప్పచ్చు. ఇక్కడ కంప్యూటర్ పరికారాలను కొనుగోలు చేసుకునేందుకు నగరం నుంచే కాకుండా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వస్తుంటారు. ఎంతో పేరున్న బజార్‌గా రికార్డు ఉన్నప్పటికీ అదేస్థాయిలో మోసాలు జరుగుతున్నాయి. ఇదే వ్యాపార భవనంలో 250కి పైగా షాపులు ఉన్నాయి. ఈ షాపుల్లో అన్ని కంప్యూటర్లకు సంబంధించిన వివిధ బ్రాండ్లను అమ్మకాలు చేస్తుంటారు. అయితే ఇందులో కొన్ని షాపులు మాత్రం ఎలాంటి జీఎస్టీ బిల్లులు లేకుండానే అమ్మకాలు సాగిస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. కంప్యూటర్ విడిభాగాలను నకిలీవి చూపించి ఇవే ఒరిజినల్ అంటూ అమాయక కస్టమర్లను నిలువుదోపిడీ చేస్తున్నారు. వీటికి ఏ మాత్రం జీఎస్టీ బిల్లు ఉండదు. ఇలా అన్ని విధాలుగా ప్రజలతోపాటు ప్రభుత్వాన్ని సైతం మోసం చేస్తున్న షాపులపై సేల్స్ టాక్స్, ఇన్ కమ్ టాక్స్, జీఎస్టీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగరవాసులు, వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story