- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాడు కోకాపేట.. నేడు రాయదుర్గం.. గ్రేటర్‌లో రియల్ భూమ్..! ఎకరాకు రూ.177 కోట్లు!!
తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లో మరోసారి రికార్డు స్థాయి ధరలకు కొనుగోలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ భూమ్ కొనసాగుతోంది. ఐటీ సెక్టార్, మౌలిక వసతుల కల్పన, మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో చేపట్టిన వేలం పాటలో రికార్డు స్థాయిలో ధర పలికింది. 2022లో కోకాపేట్ నియోపోలీసు ప్రాంతంలో ఎకరాకు రూ.100 కోట్లు పలికితే ఈ సారి రాయదుర్గ్ లో రూ.177 కోట్లు పలకడం రికార్డు నమోదు చేసింది.
హైదరాబాద్ రియల్‌ఎస్టేట్‌లో రికార్డులు బద్దలయ్యాయి. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన వచ్చింది. టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్‌ను ఎంఎస్ఎన్ రియాల్టీ దక్కించుకుంది. ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లు ఉండగా, ఎంఎస్ఎన్ రియాల్టీ ఏకంగా ఎకరా భూమిని రూ.177 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ మొత్తం విలువ సుమారు రూ.1356 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు.
నాడు వంద కోట్లు..
గతంలో రాయదుర్గ్ ప్రాంతంలో భూముల ధరలు భారీగానే పలికాయి. 2017లో రాయదుర్గం ఎకరాకు రూ.42.59 కోట్లు పలికింది. 2.84 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం వేలం వేసింది. దీంతోపాటు 2022లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట్, నియోపోలీసు ప్రాంతాల్లో నిర్వహించిన వేలంపాటలో ఎకరాకు రూ.100.75కోట్ల చొప్పున 3.60 ఎకరాలను వేలంవేశారు. ఆ తర్వాత ప్రస్తుతం ఎన్నడూలేనివిధంగా ఎకరాకు రూ.177కోట్లు పలకడంతో రియల్ భూమ్ పెరుగుతుందనడానికి నిదర్శనమని అధికారులు చెబుతున్నారు.
హాట్ కేకుల్లా హౌసింగ్ బోర్డు భూములు
హౌసింగ్ బోర్డు భూములు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. చింతల్‌లో చదరపు గజం భూమి రూ. 1.14 లక్షలు పలికింది. దీంతో హౌసింగ్ బోర్డుకు రూ.44.24 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లో మరోసారి రికార్డు స్థాయి ధరలకు కొనుగోలు చేశారు. కుత్భుల్లాపూర్ పరిధిలోని చింతల్ లోని నివాస భూముల విక్రయాల నిమిత్తం నిర్వహించిన బహిరంగ వేలం ప్రక్రియలో చదరపు గజం భూమి ధర రూ.1,14,000 పలికింది. 513 గజాల విస్తీర్ణంలోని హెచ్‌ఐజీ ఓపెన్ ప్లాట్‌కు ఆఫ్‌సెట్ ప్రైజ్ గా రూ.80 వేలు నిర్ధారించగా బహిరంగ వేలంలో చ.గజం రూ. 1.14 లక్షలకు కొనుగోలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
హెచ్‌ఐజీలోనే మరో 389 చ.గజాల విస్తీర్ణంలోని ఓపెన్ ప్లాట్ ను చదరపు గజానికి లక్ష రూపాయల ధర పలికింది. మొత్తం 18 ఓపెన్ ప్లాట్లు, 4 ఫ్లాట్ల విక్రయానికి బహిరంగ వేలం వేయగా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.44.24 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కేపీహెచ్ బీ , గచ్చిబౌలి పరిసరాల్లోని భూములకే అధిక ధరలు పలుకుతున్న నేపథ్యంలో చింతల్ ప్రాంతంలో కూడా చదరపు గజం ధర లక్ష రూపాయలు దాటడం విశేషం. నగరంలోని అన్ని ప్రాంతాల్లో నివాస భూములకు మంచి డిమాండ్ ఉందనడానికి ఇది నిదర్శనం.






