ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ వరకు.. రతన్ టాటా గ్రీన్‌ ఫీల్డ్ రోడ్డుకు టెండర్లు ఖరారు

by Javid Pasha |

ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ వరకు.. రతన్ టాటా గ్రీన్‌ ఫీల్డ్ రోడ్డుకు టెండర్లు ఖరారు

ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ వరకు.. రతన్ టాటా గ్రీన్‌ ఫీల్డ్ రోడ్డుకు టెండర్లు ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో కీలక ఘట్టానికి హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి త్రిపుల్ ఆర్ వరకు చేపట్టనున్న రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఖరారైనట్టు హెచ్ఎండీఏ వెల్లడించింది. రూ.4,030 కోట్లతో చేపట్టనున్న 41.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం రెండు ప్యాకేజీల్లో నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్యాకేజీ-1 టెండర్లను మెస్సర్స్ రిత్విక్, ప్యాకేజీ-2 టెండర్లను ఎల్ అండ్ టీ సంస్థలు దక్కించుకున్నాయి.

రూ.4,030 కోట్లతో 41.50కి.మీ

ఫ్యూచర్ సిటీపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం 41.5కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) రావిర్యాల ఇంటర్ చేంజ్ నుంచి త్రిపుల్ ఆర్ ఆమన్ గల్ వరకు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆరు లేన్ల రోడ్డు చేపట్టనున్నారు. దీన్ని భవిష్యత్ లో ఎనిమిది లేన్లకు పెంచేందుకు స్థలాన్ని కేటాయించారు. ఈ రోడ్డుకు ఇరువైపులా ఆరు లేన్ల సర్వీస్ రోడ్డుతోపాటు మూడు మీటర్ల సైకిల్ ట్రాక్, రెండు మీటర్ల ఫుట్ పాత్ కూడా నిర్మించనున్నారు. మొదటి దశలో ఓఆర్ఆర్ రావిర్యాల ఇంటర్ చేంజ్ నుంచి మీర్ఖాన్ పేట్(ఫ్యూచర్ సిటీ) వరకు రూ.1,665 కోట్లతో 19.2 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. రెండో దశలో మీర్ఖాన్ పేట్(ఫ్యూచర్ సిటీ) నుంచి త్రిపుల్ ఆర్ ఆకుతోటపల్లి వరకు రూ.2,365 కోట్లతో 22.30 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును నిర్మించనున్నారు.

ప్రభుత్వ భూముల్లోనే పనులు

గ్రీన్ ఫీల్డ్ రోడ్ల కోసం సుమారు 1,003 ఎకరాల భూములను సేకరించాల్సి ఉందని, దీని కోసం రూ.591 కోట్లు ఖర్చు చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. అయితే ప్యాకేజీ-1లో 19.20 కిలోమీటర్ల రోడ్డు కోసం 447.29 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని, భూసేకరణ పరిహారం కోసం రూ.246 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్యాకేజీ-2లో 589.63 ఎకరాల భూమిని సేకరించడానికి రూ.345 కోట్లు అవుతుందని అధికారుల అంచనా వేశారు. అధికారుల చేపట్టిన సర్వే తర్వాత 1,003భూములు అవసరమని గుర్తించారు. ఈ రోడ్డు ఐదు ఫారెస్టు బ్లాకులకు సంబంధించిన 232 ఎకరాల నుంచి వెళ్తుందని అధికారులు గుర్తించారు. ఫారెస్టు భూములతోపాటు టీజీఐఐసీకి చెందిన 202ఎకరాలు సైతం అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు 569 ఎకరాల పట్టాభూములను సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. టెండర్లు ఖరారు కావడంతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లోనే పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు.

ఆరు మండలాలు, 14 గ్రామాలు

ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు రంగారెడ్డి జిల్లాల్లోని ఆరు మండలాలు, 14 గ్రామాలను కలపనుంది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమన్ గల్ మండలాలతోపాటు 14 గ్రామాలను కలపనుంది. ఈ రోడ్డు నిర్మాణంతో సంబంధిత మండలాల్లో భూముల రేట్లు మరింత పెరిగే అవకాశముంది.

ముఖ్యమైన అంశాలు

*మొదటగా ఇరువైపుల కలిపి ఆరు లేన్ల రోడ్డును నిర్మించనున్నారు. భవిష్యత్ అవసరాలకనుగుణంగా మరో రెండు లేన్లు పెంచేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

* మెట్రోరైలు నిర్మాణం కోసం సెంట్రల్ మీడియన్ లో 20 మీటర్ల స్థలాన్ని కేటాయించారు.

* రోడ్డుకు రెండు వైపుల ఆరులేన్ల సర్వీసు రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు.

*రెండు వైపుల రెండు మీటర్ల గ్రీన్ బెల్ట్

* రెండు వైపుల మూడు మీటర్ల సైకిల్ ట్రాక్

* రెండు వైపుల రెండు మీటర్ల పుట్ పాత్

* రెండు వైపుల రెండు మీటర్ల యుటిలిటీ కారిడార్

Next Story