ఎస్‌ఐఆర్ సమాచారం ప్రజల్లోకి వెళ్లాలి.. మీడియాదే కీలక పాత్ర: కె. శ్రీనివాస్ రెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-22 14:42:45  IST  )

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితాల ప్రాధాన్యత ఎంతో కీలకమైందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ కె. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు...

ఎస్‌ఐఆర్ సమాచారం ప్రజల్లోకి వెళ్లాలి.. మీడియాదే కీలక పాత్ర: కె. శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితాల ప్రాధాన్యత ఎంతో కీలకమైందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ కె. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై జర్నలిస్టులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సహకారంతో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని మీడియా అకాడమీ ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై సమగ్ర అవగాహన పెంపొందించుకుని ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించాలని సూచించారు. ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తరఫున స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి. చెన్నయ్య, ఐటీ మేనేజర్ డి. చిరంజీవి పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై సమగ్ర వివరణ అందించారు.ఈ సందర్భంగా వారు ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం ఉద్దేశ్యం, అర్హులైన ఓటర్ల నమోదు, వివరాల సవరణ, మార్పులు, తొలగింపులు, ఇంటింటి సర్వే తదితర అంశాలపై విపులంగా వివరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమం జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరంగా, సమాచారపూర్వకంగా సాగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.

Next Story