- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రహసనంగా మారిన సర్ ప్రక్రియ
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. దరఖాస్తుల పంపిణీ నుంచి ఆన్ లైన్ నమోదు వరకు సాధారణ ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. దరఖాస్తుల పంపిణీ నుంచి ఆన్ లైన్ నమోదు వరకు సాధారణ ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. సర్ లో ఓటరు నమోదు కోసం ఇంటింటికి తిరిగి దరఖాస్తు ఫారాలు అందజేయడంలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొంతమందికి దరఖాస్తు ఫారాలు అందకపోవడం, అందినా ఫారాలు నింపడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. క్షేత్ర స్థాయిలో ఇంటింటికి తిరిగి ఓటర్ నమోదు చేయాల్సిన బూత్ స్థాయి అధికారులు ( బీఎల్ ఓ) ఒక్కొక్కరికి వెయ్యి గృహాలను కేటాయించారు. వీరంతా తమకు కేటాయించిన ప్రకారం కాలనీలు, బస్తీలలో పర్యటించి ఎన్యమురేషన్ ఫారాలలో ఓటరు నమోదు పూర్తి చేయాల్సి ఉండగా చాలామంది బీఎల్ ఓ లు కమ్యూనిటీ హాల్ లలో కూర్చోవడం , వివిధ పార్టీల లీడర్లకు ఫారాలు అప్పగించి నింపించి ఇవ్వాలని చెబుతుండడంతో అవి అందరికీ చేరడం లేదు. దీంతో ప్రజలు తమ ఓటు హక్కు గురించి ఆందోళన చెందుతున్నారు. జూన్ 25న ప్రారంభమైన నమోదు ప్రక్రియ ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. అయితే హైదరాబాద్ జిల్లాలో కేవలం 62 శాతం ఫారాల పంపిణీ మందకొడిగా జరుగడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటి వరకు దరఖాస్తు ఫారాలే అందించకపోతే అవి నింపడం, తిరిగి బీఎల్వోలకు ఎప్పుడు ఇవ్వాలో తెలియకపోవడం, మరోవైపు గడువు సమీపిస్తుండటంతో సాధారణ ప్రజలు ఫారాలు ఎలా నింపాలనేది తెలుసుకునేందుకు తెలిసిన వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో 47,36,669 ఓటర్లకు గాను 29 లక్షల పై చిలుకు మందికి మాత్రమే ఇప్పటి వరకు ఫారాల పంపిణీ జరిగింది. ఫారాల పంపిణీ పూర్తి స్థాయిలో జరిగి ఓటరు నమోదు కార్యక్రమం గడువులోగా పూర్తవుతుందా అనేది సందేహంగా మారింది.
సమస్యలకు కారణమౌతున్న 2002 నాటి ఓటర్ వివరాల సేకరణ ....
ప్రస్తుత 'సర్' ప్రక్రియలో 2002 నాటి ఓటరు జాబితా వివరాలను లింక్ చేయాల్సి ఉంది. అప్పటి ఓటర్ కార్డులు లేనివారు లేదా ఆ సమయంలో ఓటు లేని యువకులు తమ తల్లిదండ్రుల 24 ఏళ్ల నాటి పాత వివరాలను వెతుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇస్తున్న ఫారాలలో ఓటరు ఐడీ వివరాలు మాత్రమే ఉంటున్నాయి. మిగతా శాసనసభ నియోజకవర్గం పేరు , భాగం సంఖ్య , క్రమ సంఖ్య ,శాసనసభ నియోజకవర్గం సంఖ్య , పాత బూత్ నంబర్, పార్ట్ నంబర్ వంటి వివరాలను ఓటర్లే స్వయంగా వెతుక్కుని పూరించాల్సి వస్తుండడంతో ఏం నింపాలో తెలియక అక్షరాస్యులు సైతం ఇబ్బందులకు గురౌతున్నారు . హైదరాబాద్‌లో ఉర్దూ లేదా ఇంగ్లీష్ మాట్లాడే వారికి కేవలం తెలుగులోనే ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తుండటంతో వాటిని చదవడం, నింపడం కష్టంగా మారింది. పెండ్లిళ్లు చేసుకున్న మహిళల విషయంలో ఇంటి పేరు కూడా సమస్యగా మారుతోంది .
అపార్ట్ మెంట్లలో ...
హైదరాబాద్ జిల్లాలో అపార్ట్ మెంట్లు అధికంగా ఉంటాయి . కొన్ని చోట్ల వందలాది కుటుంబాలు వీటిల్లో నివాసం ఉంటున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు , అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారి విషయంలో సర్ ఫారాల పంపిణీలో క్షేత్రస్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెక్యూరిటీ కారణాల వల్ల అపార్ట్‌మెంట్లలోకి బీఎల్‌వోలను ప్రతి ఫ్లాట్‌కు నేరుగా అనుమతించని చోట, అధికారులు అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లేదా సెక్రటరీని సంప్రదిస్తున్నారు. పగటిపూట ఉద్యోగాలకు వెళ్లేవారు ఎక్కువగా ఉండే అపార్ట్‌మెంట్లలో, బీఎల్‌వోలు ఆయా ఫ్లాట్ నంబర్ల వారీగా ఎన్యూమరేషన్ ఫారాలను సెక్యూరిటీ డెస్క్ లేదా మైంటెనెన్స్ ఆఫీస్ లో ఇచ్చి వెళ్తుండడంతో అవి అక్కడ అందరికీ చేరడం లేదు . గతంలో వేరే ప్రాంతంలో ఉండి కొత్తగా అపార్ట్‌మెంట్‌కు మారిన వారికి పాత అడ్రస్‌లోనే ఫారాలు ఇస్తుండటంతో గందరగోళం నెలకొంది .
ఆన్‌లైన్ దరఖాస్తుల్లో సాంకేతిక ఇబ్బందులు ...
బీఎల్‌వోతో పని లేకుండా స్వయంగా ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ప్రక్రియను voters.eci.gov.in పోర్టల్‌లోకి వెళ్భి పూర్తి చేయవచ్చు . గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఓటర్ ఐడీ నంబర్ (ఎపిక్ ) సాయంతో లాగిన్ అయి, ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) లింక్‌పై క్లిక్ చేసి వివరాలను, ఆధార్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు అయితే ఈ విధానంలోనూ సమస్యలు ఎదురౌతున్నాయి . ఆధార్, ఓటర్ ఐడీ డేటా సరిపోలకపోవడం , ఓటర్ ఐడీ కార్డులోని పేరు, ఆధార్ కార్డులోని పేరు స్పెల్లింగ్స్ అక్షరం తేడా ఉన్నా సిస్టమ్ దరఖాస్తును అంగీకరించడం లేదు. ఒక కార్డులో ఇంటిపేరు మొదట, మరో కార్డులో చివరిన ఉంటే 'డేటా మిస్ మ్యాచ్' వస్తూ అప్లికేషన్ తిరస్కరణకు గురవుతోండడం జరుగుతోంది . గడువు సమీపిస్తుండడంతో ఒకేసారి ఎక్కువ మంది వెబ్‌సైట్ ను ఉపయోగించడం వల్ల సర్వర్లు పూర్తిగా నెమ్మదించి 'ఎర్రర్ 504' లేదా ' పేజ్ టైమ్డ్ ఔట్ అని వస్తోంది. మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కోసం రావాల్సిన ఓటీపీలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి. కొన్ని సందర్భాలలో అసలు రావడం లేదు. దీనివల్ల లాగిన్ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతోంది. దరఖాస్తును విజయవంతంగా సబ్మిట్ చేసినప్పటికీ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవాల్సిన అప్లికేషన్ నంబర్ లేదా రసీదు పిడిఎఫ్ డౌన్‌లోడ్ కావడం లేదు. ఫారం సబ్మిట్ అయిందా లేదా అనేది తెలుసుకునే 'ట్రాక్ స్టేటస్ ' ఆప్షన్ కూడా సరిగ్గా పని చేయడం లేదు. 24 ఏళ్ల నాటి పాత ఓటరు వివరాలను ఆన్‌లైన్ సిస్టమ్‌లోకి ఎక్కించడంలో అనేక తప్పులు దొర్లాయి. దీనివల్ల పాత ఓటర్ ఐడీ నంబర్ కొట్టినా " నో రికార్డ్ ఫౌండ్ " అని చూపిస్తోంది.ఫోటోలు, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ల సైజ్ చాలా తక్కువ (కేబీ లలో) ఉండాలనే నిబంధన ఉంది. సాధారణ ప్రజలకు మొబైల్‌లో ఫైల్ సైజ్ తగ్గించడం తెలియక డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయలేకపోతున్నారు. మొత్తం మీద అక్షరాస్యులు అధికంగా ఉండే హైదరాబాద్ జిల్లాలోనూ సర్ ఫారాల సమర్పణ ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా బీఎల్వో ల సంఖ్య పెంచడంతో పాటు వారు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు






