వారం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య.. అనేక అనుమానాలు

by Bhanu |

ఒకే స్కూల్ లో చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులు వారం రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరిగా ఆత్మహత్యలకు పాల్పడడం కలకలం సృష్టించింది.

వారం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య.. అనేక అనుమానాలు
X

దిశ, శేరిలింగంపల్లి : ఒకే స్కూల్ లో చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులు వారం రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరిగా ఆత్మహత్యలకు పాల్పడడం కలకలం సృష్టించింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. మియాపూర్ సెయింట్ మార్టిన్ హైస్కూల్ లో చదువుతున్న రిజ్వాన్ (15) మహ్మద్ ఈనెల 19న స్కూల్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. అదే పాఠశాలకు చెందిన హన్సిక నాయక్ (15) గురువారం తాము నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలపై అనేక అనుమానాలు తలెత్తుతుండగా శుక్రవారం విద్యార్థిని హన్సిక తల్లిదండ్రులు, ఆమె బంధువులు సెయింట్ మార్టిన్ హై స్కూల్ వద్ద ఆందోళనలకు దిగారు. బాలిక కుటుంబ సభ్యులకు పలు విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి. స్కూల్ యాజమాన్యం, రిజ్వాన్ తల్లి తండ్రుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని, మృతురాలి తండ్రి విజయ నాయక్ ఆరోపించారు. స్కూల్ యాజమాన్యంపై, రిజ్వాన్ తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. స్కూల్ ఎదుట ఆందోళనల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.

ఒకే తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు రోజుల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారగా.. ప్రేమ వ్యవహారమే విద్యార్థుల మృతికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరు మైనర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మైనర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్కూల్ యాజమాన్యం మాత్రం స్పందించక పోవడం పట్ల విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story