నగరంలో ఎక్కడెక్కడా అగ్నిప్రమాదాలు జరిగాయి... అందుకు కారణమిదేనా..?

by Dishanational1 |
నగరంలో ఎక్కడెక్కడా అగ్నిప్రమాదాలు జరిగాయి... అందుకు కారణమిదేనా..?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో చోటు చేసుకుంటున్న భారీ అగ్నిప్రమాదాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు ఫైర్ యాక్సిడెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. గత జనవరి నెలలో మినిస్టర్ రోడ్డులోని డక్కన్ కాంప్లెక్స్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ సంఘటనతోనైనా అధికారులు కండ్లు తెరువలేదు. తనిఖీలు చేసి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని బహుళ అంతస్తుల భవనాల యాజమాన్యాలపై చర్యలు తీసుకంటారని అంతా భావించారు. అయితే అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు కూడా లేవు. దీంతో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో గత కొన్నాళ్లుగా వేసవి కాలం, వర్షాకాలం అనే తేడా లేకుండా తరచుగా ఎక్కడో ఓ చోట ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి.

ఫైర్ సేఫ్టీ లేకుండా పాలకులు అండతో పెద్ద సంస్థలు, కంపెనీలు భారీగా నిర్మిస్తున్నా అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఊహించని రీతిలో ప్రాణ, ఆస్థి నష్టం జరుగుతోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఇతర మానవ తప్పిదాలు తదితర కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత అధికారులు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప వాటిని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు అంతటా వెల్లువెత్తుతున్నాయి. గతంలో సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ గ్రౌండ్, సెల్లార్లలో ఉన్న ఈ వెహికిల్ షో రూంలో రాత్రి సమయంలో విద్యుదాఘాతం చోటు చేసుకోవడంతో ఎనిమిది మంది దుర్మరణం పాలు కాగా ఆరుగురు తీవ్ర కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం కండ్ల ముందు కదలాడుతుండగానే డక్కన్ కాంప్లెక్స్, తాజాగా గురువారం రాత్రి స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద సంఘటనలతో మరోమారు నిబంధనల డొల్లతనం బయటపడినట్లైంది. ఇదే భవనంలో సుమారు ఐదేండ్ల క్రితం గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అప్పట్లో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ సంఘటన అధికారులు, భవన యాజమాన్యం కండ్లు తెరిపించలేదు. వారి నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.

ఏడాదిలో ఎన్ని ప్రమాదాలో...

గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అందులో ఉన్నవారు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది, రెస్క్యు టీం సకాలంలో స్పందించి భవనం పై అంతస్థులో చిక్కుకున్న సుమారు 20 మందిని కాపాడారు. అదే తీరులో హిమాయత్ నగర్, పాతబస్తీ ప్రాంతాలలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత యేడాది మార్చి 23వ తేదీన అంటే సరిగ్గా ఏడాది క్రితం సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోదాంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనం కాగా గాయపడిన మరొకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏప్రిల్ నెలలో రాజేంద్రనగర్ కాటేదాన్ లోని ప్లాస్టిక్ ప్రింటింగ్ పరిశ్రమంలో అగ్ని ప్రమాదం సంభవించి కోట్ల రూపాలయ ఆస్థి బూడిదైంది. అంతేకాకుండా ఏప్రిల్ 22వ తేదీన అత్తాపూర్ లోని ఓ కార్ల షెడ్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువ చేసే కార్లు మంటలలో కాలిపోయాయి.

ఇవేకాకుండా జనవరిలో సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడవ అంతస్తులో టాక్స్ కలెక్షన్స్ సెక్షన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కార్యాలయంలో భారీగా పొగ కమ్ముకుంది. భయంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలు ఫైల్స్ దగ్ధం అయాయ్యి. జనవరి నెలలోనే అర్ధరాత్రి సమయంలో సికింద్రాబాద్ క్లబ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా 1878లో బ్రిటీష్ హయాంలో నిర్మించిన చారిత్రాత్మక క్లబ్ అగ్నికి ఆహుతైంది. తెల్లవారుజామున జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ లో భారీ ఎత్తున ఆస్తినష్టం వాటిల్లింది. మరో సంఘటనలో రాజేంద్రనగర్ లో 45 కుటుంబాలు నివాసముంటున్న ఓ బహుళ అంతస్థుల అపార్ట్ మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ఎలాంటి ఘోరం జరిగేదో ఊహించడానికి కూడా కష్టంగా ఉండేది. 2022 జనవరి నెలలో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు భాగ్యనగర్ కాలనీలోని శివపార్వతి థియేటర్ లో సైతం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సెకండ్ షో ముగిసిన తర్వాత రోజుమాదిరిగానే థియేటర్ ను మూసివేయగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో అకస్మాత్తుగా థియేటర్ లో మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడ్డ మంటలతో థియేటర్ మొత్తం అగ్నికి ఆహుతైంది. అయితే తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ భారీగా ఆస్తినష్టం చోటుచేసుకుంది.

గత జనవరి నెలలో మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు గల్లంతు కావడం, వారి ఆచూకీ తెలియకపోవడం, ఇప్పుడు స్వల్పలోక్ కాంప్లెక్స్ సంఘటనలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కాలాలతో సంబంధం లేకుండా ఇలా ప్రతినిత్యం ఏదో ఒక చోట అగ్గి రేగుతుండడంతో జీహెచ్ఎంసీ పరిధిలో నివాసం ఉండేవారు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనలకు గురౌతున్నారు. మానవ తప్పిదాలతో జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని గ్రేటర్ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఫైర్ సేఫ్టీ ఉన్నా ఎందుకు కాపాడలేకపోయారు ...?

స్వప్నలోక్ కాంప్లెక్స్ల్ లో ఫైర్ సేఫ్టీ సిస్టం ఉన్నా మృతిచెందిన ఆరుగురిని ఎందుకు కాపాడలేకపోయారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని చాలా షాపింగ్ మాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్ లో, థియేటర్స్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు గాలికి వదిలేశారన్న ఆరోపణలున్నాయి. పేరుకు మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తున్నారే కానీ ప్రమాదాలు జరిగితే ఒక్కటి కూడా పనిచేయడం లేదన్నది చాలా సందర్భాల్లోనూ తేలింది. సికింద్రాబాద్ రూబీ హోటల్ భవనంలోని ఈ వెహికిల్ షోరూం సంఘటనలో కూడా ఫైర్ సేఫ్టీ సిస్టం ఉన్నప్పటికీ అవసరాల మేరకు లేకపోవడంతో మంటలను అదుపులోకి తేవడం కష్టంగా మారి ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ఇప్పుడు స్వప్నలోక్ కాంప్లెక్స్ సుమారు 30 ఏండ్ల క్రితం నిర్మించిందని అయినా ఫైర్ ఇంజన్ తిరిగేలా సేఫ్టీ నిబంధనలు పాటించారని హోం మంత్రి మహమూద్ అలీ, ఫైర్ అధికారులు సైతం కితాబిచ్చారు. ఫైర్ సేఫ్టీ నిబంధనల మేరకే భవన నిర్మాణం ఉన్నప్పటికీ అందులో చిక్కుకున్న ఆరుగురిని ఎందుకు కాపాడలేకపోయారో మంత్రి, అధికారులు సమాధానం ఇవ్వాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఐదవ అంతస్తులోని బాత్ రూంలో ఆరుగురం ఉన్నామని, పొగలు వస్తున్నాయని, తమను కాపాడాలని త్రివేణి అనే యువతి స్వయంగా సోదరికి ఫోన్ చేసి మాట్లాడింది. సంఘటనలో మృతిచెందిన మరో యువకుని స్నేహితుడు మాట్లాడుతూ తన మిత్రుడు లోపల స్పృహ తప్పి పడి ఉన్నాడని, ఆక్సీజన్ ఇచ్చి కాపాడండి అని అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. వారిని సకాలంలో బయటకు తీసుకురాలేకపోవడంతో వారి కుటుంబాలలో పెను విషాదం మిగిల్చింది. చాలా చోట్ల ఫైర్ సేఫ్టీ సిస్టం అలంకార ప్రాయంగా మారుతున్నాయి. అపార్ట్మెంట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫైర్ నిబంధనలు గాలికి వదిలేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి దుస్థితి తలెత్తుతోందనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు బహుళ అంతస్థుల భవనాలను తనిఖీ చేసి వాటికి ఫైర్ అనుమతులతోపాటు వాటిల్లో ఉన్న ఫైర్ సేఫ్టీ సిస్టంలు పని చేస్తున్నాయా ? లేదా ? అనేది నిర్ధారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వేసవి ఆరంభంలోనే ఉండగా రానున్న రోజులలో ఎలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాటే వారి పట్ల కఠినంగా అధికారులు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story

Most Viewed